ఎగ్జిట్ పోల్స్ నమ్మొద్దు.. అదంతా బీజేపీ ప్రచారం

 

ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోదీ నేతృత్వంలోని ఎన్డీయేనే తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలంతా నిరాశ నిస్పృహలకు లోనుకావొద్దని.. కేవలం కాంగ్రెస్ వర్గాల్లో భయాందోళనలు నెలకొల్పడం కోసమే బీజేపీ ఇలాంటి ప్రచారాలకు తెరలేపిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె కార్యకర్తలకు ఓ ఆడియో సందేశం విడుదల చేశారు.  ‘‘ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల నేపథ్యంలో కార్యకర్తలెవరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టాలనే.. ప్రత్యర్థి పార్టీలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ తరుణంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కౌంటింగ్‌ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వైపు నిఘా ఉంచండి. మన శ్రమకు కచ్చితంగా ఫలితం దక్కుతుందన్న నమ్మకం నాకుంది’’ అని కార్యకర్తలకిచ్చిన సందేశంలో ప్రియాంక పేర్కొన్నారు.