తెలంగాణలో ఎవరిది అధికారం? ఏది నిజం?

 

ఎన్నికల సమయంలో ఫలితాల కోసం ఉత్కంఠ ఉండటం సహజం. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉన్న ఉత్కంఠ మరే ఎన్నికల మీద లేదనేది నిజం. టీఆర్ఎస్, ప్రజకూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారోనని తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న ఎన్నికలు జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అయినా ప్రజలకు ఫలితాల మీద ఒక స్పష్టత రాలేదు. మాములుగా అయితే ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఫలితాల మీద ఒక అవగాహన వస్తుంది. కానీ తెలంగాణ విషయంలో అది జరగలేదు. దానికి ప్రధాన కారణం లగడపాటి సర్వే. ఎగ్జిట్ పోల్స్ కి పూర్తి భిన్నంగా లగడపాటి సర్వే ఉంది. దీంతో ఫలితాల మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

లగడపాటి పొలిటిషీయన్ గా ఎంత ఫేమస్సో దానికి పదిరెట్లు పెప్పర్ స్ప్రేతో ఫేమస్. దానికి వంద రెట్లు సర్వేలతో ఫేమస్. ఆయన సర్వేలు దాదాపు నిజమవుతాయి. అందుకే ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు. అలాంటి లగడపాటి తెలంగాణలో ప్రజకూటమిదే విజయమని చెప్పేశారు. కూటమికి 55 నుంచి 75 సీట్లు, టీఆర్ఎస్ కి 25 నుంచి 45 వస్తాయని చెప్పారు. మొత్తానికి కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం లగడపాటి సర్వేకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ దే అధికారం అంటున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రం హంగ్ కి ఆస్కారం ఉందన్నాయి. అయితే మెజారిటీ సర్వేలు మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో మళ్ళీ అధికారం మాదే అంటూ టీఆర్ఎస్ ధీమాగా ఉంది.

మరోవైపు కూటమి కూడా మేమే అధికారంలోకి వస్తామని నమ్మకంగా చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చినట్టు ఖచ్చితంగా జరగాలని లేదు. గతంలో ఆ సర్వేల అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా లగడపాటి చెప్పింది దాదాపు జరుగుతుంది అని కూటమి చెప్తుంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లగడపాటి సర్వే కూటమి వైపు మొగ్గుచూపుతుంది. మరి విజయం ఎవరివైపు మొగ్గుచూపుతుందో, ఎవరు చెప్పింది నిజమవుతుందో తెలియాలంటే 11  వ తేదీ వరకు వేచి చూడాల్సిందే..