ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే?

చచ్చీచెడీ తెగ వ్యాయామం చేస్తామా! ఒంట్లో ఒక్క అరకిలో బరువు కూడా తగ్గకపోవడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మనం చేసే పొరపాట్లే మన కష్టానికి తగిన ఫలితం రాకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి ఏదో ఒకటి తిన్న తరువాత వ్యాయామం చేయడం! అదెంత పొరపాటో మీరే చూడండి...

 

ఏదన్నా తిన్న తరువాత వ్యాయామం చేయడానికీ, ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడానికి మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో తెలుసుకునేందుకు బ్రిటన్లోని ఒక విశ్వవిద్యాలయంలో పరిశోధన జరిగింది. దీని కోసం పరిశోధకులు ఊబకాయంతో బాధపడుతున్న కొందరు మగవారిని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరి చేత ఖాళీ కడుపు మీద ఓ గంటపాటు వ్యాయామం చేయించారు. మరికొందరిచేత శుభ్రంగా ఏదన్నా తిన్నతరువాత వ్యాయామం చేయించారు.

 

వ్యాయామానికి ముందరా తరువాతా కూడా అభ్యర్ధుల నుంచి రక్తం నమూనాలని సేకరించి పరీక్షించారు. ఈ పరీక్షలో... ఖాళీ కడుపు మీద ఆహారం తీసుకున్నప్పుడు, కొవ్వు కణాలకు చెందిన PDK4, HSL అనే రెండు జన్యువులు విభిన్నంగా ప్రవర్తించడం కనిపించింది. PDK4 పనితీరులో మార్పు వల్ల వ్యాయామానికి కావల్సిన శక్తిని, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు నుంచి సేకరిస్తున్నట్లు తేలింది. అదే ఆహారం తిన్న తరువాతైతే అప్పుడే తిన్న తిండి నుంచి వ్యాయామానికి కావల్సిన శక్తిని పొందుతున్నాయన్నమాట. HSL అనే జన్యువు కూడా అవసరం అయినప్పుడు ఒంట్లోని కొవ్వు కణాలను కరిగించేందుకు దోహదపడేదే!

 

ఇంతకీ ఖాళీ కడుపు మీద వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రభావం ఉంటుందని పాశ్చాత్య పరిశోధకులు తేల్చారన్నమాట. ఒక్కసారి మన యోగాసనాల గురించి తల్చుకుంటే... ఉదయం వేళ సూర్యనమస్కారాలు వంటి ఆసనాలు వేసేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండాలన్న నియమం గుర్తుకురాకమానదు. కాకపోతే మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఎవరో పాశ్చాత్యులు తిరిగే చెబితే కానీ మనకి నమ్మబుద్ధి కాదు!!!

- నిర్జర.