పరీక్షలే జీవితం కాదు... జీవితమే అసలైన పరీక్ష

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. మొన్నామధ్య ఏపీలో, ఇప్పుడేమో తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల గురించే చర్చలు జరుగుతున్నాయి. మనకి తెలిసిన వాళ్ల ఇళ్లలో ఇంటర్ చదివే పిల్లలు ఎవరున్నారా అంటూ ఆసక్తిగా అందరూ ఫోన్లు చేస్తున్నారు. మార్కులు బాగా వస్తే అందరికీ సంతోషమే! కానీ తక్కువ వస్తేనో, లేక తప్పిపోతేనో అసలు సమస్య మొదలవుతుంది. పిల్లలు దిగాలు పడిపోవడం, డిప్రెషన్లోకి కూరుకుపోవడం, ఒకోసారి ఆత్మహత్యకి సైతం పాల్పడం జరుగుతూ ఉంటుంది. పరీక్షల్లో తప్పారన్న కారణంతో పిల్లలు తమ ఉసురుని తీసుకునే వార్తలు ఉసూరుమనిపిస్తాయి. పిల్లలు ఇలాంటి విపరీత మనస్తత్వంలోకి కూరుకుపోయినప్పుడు వారిని తిరిగి మామూలు మనుషులను చేసే సత్తా, బాధ్యతా తల్లిదండ్రుల మీద తప్పకుండా ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే...

 

 

- పరీక్షా ఫలితాల తరువాత పిల్లవాడు డీలాగా కనిపిస్తుంటే అతనితో కాసేపు సమయాన్ని గడపండి. ఒకవేళ అతని దిగాలుకి ఫలితాలే కారణమైతే, అతనిలో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించండి. పిల్లవాడు క్రుంగుబాటుకి లోనైన ఈ కొద్ది రోజులలో అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ కాలాన్ని కనుక వాళ్లు దాటేయగలిగితే, ఆత్మహత్య వంటి ఆలోచనలు కూడా దాటిపోతాయి. అందుకని పిల్లవాడు తిరిగి మామూలు స్థితికి వచ్చేదాకా అతన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోసేలా మీరు అతని ఫలితాల పట్ల నిరాశ చెందిన విషయాన్ని ప్రస్తావించవద్దు.

 

 

- ఇంటికి వచ్చినవారంతా పిల్లవాడి ఫలితాల గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటి ప్రస్తావనని వీలైనంత త్వరగా ముగించేయండి. ‘కష్టపడ్డాడు కానీ...’, ‘మళ్లీ అందుకుంటాడు...’ లాంటి సానుకూలమైన వాక్యాలతోనే అతని ఫలితాల గురించి తెలియచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కళ్ల ముందే వేరొకరు, మీ పిల్లవాడిని మందలించే అవకాశం ఇవ్వవద్దు. అతిథులతో ఫలితాలకు సంబంధించిన చర్చలను కూడా వీలైనంత క్లుప్తంగా ముగించేయండి.

 

-  తమ పిల్లవాడి తప్పాడన్న విషయం కంటే ఇతరుల పిల్లలు పాస్‌ అయ్యారన్న బాధే చాలామందికి ఉంటుంది. ఇది మానవసహజమే! కానీ ఇలాంటి సమయాలలో పోలికలు కొంప ముంచుతాయని గుర్తుంచుకోండి. ఫలానా సుబ్బారావుగారి పిల్లవాడి సంగతి మనకి అనవసరం. అలాగే మన పిల్లవాడి స్నేహితుల ఫలితాలూ ప్రస్తుతానికి అసందర్భం. పోలికలంటూ తెస్తే పరాజయాలనూ తీసుకురండి. ఫలానా ఎడిసన్ కూడా చిన్నప్పుడు ఫెయిల్‌ అయ్యాడనో, మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి పరాజయాలను ఎదుర్కొన్నారనో చెప్పి పిల్లలను ఊరడించండి.

 

- పరీక్ష ఫలితాన్ని ఎలాగూ మార్చలేము. కాబట్టి అసలు ఇలాంటి ఫలితం రావడానికి కారణం ఏంటో కనుక్కొనేందుకు ప్రయత్నించండి. ఇల్లు, కళాశాల, స్నేహాలు, ఏకాగ్రత, అనారోగ్యం... ఇలా ఏ సమస్య పిల్లవాడి చదువుకి అడ్డం పడుతోందో విశ్లేషించండి. పిల్లవాడు భవిష్యత్తులో తిరిగి ఓడిపోకుండా ఆ కారణానికి తగిన పరిష్కారాన్ని కూడా సాధించండి. ఆ పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ ప్రణాళికను ఏర్పరిచేందుకు ప్రయత్నించండి. ఈ విశ్లేషణలో మీ పిల్లవాడిని కూడా భాగస్వామిగా చేసుకోవడం మర్చిపోవద్దు.

 

- పిల్లవాడని మరీ సుకుమారంగా పెంచడంతో ఒకోసారి వారు పరాజయాలను తట్టుకునే స్థితిలో ఉండరు. కాబట్టి ముందుగా మీ దృక్పథాలను కూడా ఓసారి సరిచూసుకోండి. పిల్లవాడికి నిరంతరం చదువే లోకంగా మారిపోతోందా? అతనిలో శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత లోపిస్తున్నాయా? అన్నది ఒక్కసారి గమనించుకోండి. ఈ విషయంలో అవసరమైతే సైకాలజిస్టుల వంటి నిపుణుల సలహాలను తీసుకోవడంలో తప్పేమీ లేదు.

 

ఒకరకంగా చెప్పాలంటే పరీక్షలలో బాగా తక్కువ ఫలితాలు రావడం అన్నది ఓ హెచ్చరికలాంటిది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందన్న సూచన మాత్రమే! ఆ హెచ్చరికను గ్రహిస్తే పిల్లవాడు భవిష్యత్తులో మరిన్ని పరాజయాలు ఎదుర్కోకుండా రక్షించనవారమవుతాం. లేకపోతే వాడి జీవితాన్ని మన ఆశలకు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నించి భంగపడతాం!

 

- నిర్జర.