కనుమరుగైన నాటి ఎక్సైజ్ శాఖామంత్రి...

 

ఆ పార్టీ అధినేతకు అత్యంత విధేయుడు, పార్టీ పట్ల అంకితభావం కలిగిన నేత, అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరించడమే కాకుండా పార్టీగళాన్ని ఎప్పటికప్పుడు మీడియాలో వినిపించేవారు. అలాంటి నాయకుడు మాజీ మంత్రిగా మారిన తర్వాత పార్టీ వ్యవహారాలకు దూరమైపోయారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఏర్పడిన అసంతృప్తి ఆయనను దహించి వేస్తోంది. ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి పెట్టి టిడిపిలో చేరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేశారు కొత్తపల్లి శామ్యూల్ జవహర్. నాటి ఎన్నికల్లో గెలుపొందారు కూడా అంతేకాదు నాటి సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు ఎక్సైజ్ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు.

అయితే జవహర్ మంత్రి అయ్యే వరకు కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆయనతో ఉన్నాయి. మంత్రి పదవి వచ్చిన తర్వాత మాత్రం నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. స్థానికంగా కొందరు నేతలు జవహర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని తెలుగుదేశం హైకమాండ్ మొగ్గలోనే తుంచి వేయకపోవడంతో అది పెరిగి పెద్దదైంది. ఎన్నికల నాటికి ఈ వివాదం జవహర్ కు టికెట్ ఇవ్వొద్దనే వరకూ వెళ్ళింది. చంద్రబాబు దగ్గర కూడా అసంతృప్త నేతలు వెళ్ళి జవహర్ కు టికెట్ ఇవ్వొద్దని కోరారు. కానీ చివరి నిమిషంలో జవహర్ ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి మార్చింది పార్టీ హైకమాండ్. నిజానికి ఆయన జన్మస్థలం తిరువూరు నియోజకవర్గమే అయినప్పటికీ ఆయన రాజకీయంగా ఎదిగింది మాత్రం కొవ్వూరులోనే, ఇప్పటి వరకు తిరువూరు టిడిపి ఇన్ చార్జి గా ఉన్న నల్లగట్ల స్వామి దాసు జవహర్ కు పార్టీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురయ్యారట. ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి పని చేసినప్పటికీ జవహర్ పరాజయం పాలయ్యారు. కొవ్వూరులో పోటీ చేసిన అనిత కూడా ఓడిపోయారు. 

ఇదిలా వుంటే ఎన్నికల సమయంలో డబ్బు ఖర్చు పెట్టాలనే హైకమాండ్ చెప్పడంతో అప్పులు చేసి తెచ్చిన జవహర్ ఇప్పుడు ఆ రుణం తీర్చలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో పాటు తనకు కొవ్వూరు లేదా తిరువూరులో ఏదో ఒక నియోజక వర్గాన్ని ముందే ఖరారు చేస్తే తాను రాబోయే ఎన్నికల నాటికి ఆ నియోజక వర్గంలో పనిచేస్తాననీ కేడర్ ను పటిష్ఠం చేసుకుంటానని ఆయన అధిష్టానం వద్ద ప్రతిపాదించారని సమాచారం. ఇంకా చాలా సమయం ఉంది కదా అని అగ్రనేతలు ఆ విషయాన్ని దాటవేశారు. ఉపాధ్యాయ వృత్తి, ఉపాధ్యాయ ఉద్యమాల గురించి వచ్చిన తనకు ఎదురైన పరిస్థితి పై జవహర్ ఆవేదన చెందారు. తన బాధను అగ్రనేతలందరి వద్ద వ్యక్తం చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు జవహర్ దూరంగా ఉన్నారు. అటు ఆర్ధిక ఇబ్బందుల చుట్టుముట్టడం ఇటు రాజకీయంగా భవిష్యత్ కూడా కనిపించకపోవడంతో ఆయన డీలా పడ్డారు. రాజకీయాలకు దూరంగా ఏదో ఒక ప్రైవేట్ స్కూల్ లో చేరితే నెలకు యాభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల వరకు వేతనం వస్తుందని జవహర్ నేరుగా సహచర నేతల వద్ద వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం కాస్తా పార్టీ అధినేత చంద్రబాబు వరకు వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు సూచన మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు జవహర్ తో ఫోన్ లో మాట్లాడి బుజ్జగించినట్టు తెలుస్తోంది.

అయినప్పటికీ జవహర్ ఆవేదన చల్లారలేదని, ఇటీవల ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీకి రాజీనామా చేసి ఉపాధ్యాయ వృత్తి లోకి వెళితే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించినట్టు తెలిసింది. గుంటూరులో ఉన్న తన ఇంటిని కూడా అమ్మకానికి పెట్టారని, అయితే రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంతో తక్కువ ధరకు అడుగుతున్నారని పార్టీ నేతలు వద్ద ఆయన చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబుకు తానేప్పుడ్డు విధేయుడినే అని ఉద్యమాల నుంచి వచ్చిన తనను విస్మరించడం భవిష్యత్ పై భరోసా ఇవ్వకపోవడమే బాధ కలిగిస్తోందని ఆయన బాహాటం గానే చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరమైన జవహర్ తో అగ్రనేతల సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.