ధిక్కారంపై రగిలిపోతున్న హైకమాండ్... ఈటలపై సైలెంట్ ఆపరేషన్..!

ధిక్కార స్వరం వినిపించిన ఈటలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ హైకమాండ్ ఆపరేషన్ మొదలుపెట్టిందట. అటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వపరంగా చుక్కలు చూపిస్తోందని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఈటల ప్రాధాన్యత తగ్గిస్తూ, క్రమక్రమంగా దూరం పెడుతోందట. పేరుకి వైద్యారోగ్యశాఖ మంత్రి అయినా, నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి కేసీఆరే తీసుకుంటున్నారని, పైగా ఇఫ్పుడు కొత్తగా కేబినెట్ లోకి వచ్చిన కేటీఆర్ కూడా ఈటల శాఖలో జోక్యం పుచ్చుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే మన్సిపల్ శాఖామంత్రిగా డెంగ్యూపై సమీక్షా సమావేశం నిర్వహించిన కేటీఆర్... వైద్యారోగ్యశాఖ పరిధిలోని పనులను కూడా ఆయనే చేపడుతూ, ఒకవిధంగా ఈటల చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ నిర్వహించిన సమావేశానికి ఈటల కూడా హాజరైనా, మీడియా సమావేశంలో మాత్రం పాల్గొనకుండానే వెళ్లిపోవడం అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి.

ఇదిలాఉంటే, రాజకీయంగానూ ఈటలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అసలు గంగుల కమలాకర్ ను కేబినెట్ లోకి తీసుకున్నదే ఈటలకు వ్యతిరేకంగా అనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు అదే సామాజికవర్గానికే చెందిన. గంగులను... ఈటలకు పోటీగానే మంత్రివర్గంలోకి తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. గంగుల ద్వారాలనే ఈటలకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. అందుకే బీఏసీ మీటింగ్ కి ప్రతీసారి వెళ్లే ఈటలను కాకుండా ఈసారి కమలాకర్ ను అధిష్టానం పంపించింది. ఇక ఛాంబర్ విషయంలోనూ ఈటలకు ఇబ్బందులు పెట్టారట. ఈటల ఛాంబర్ ను ఖాళీ చేయించి హరీష్ కి ఇచ్చారట. దాంతో ఈటల మరో ఫ్లోర్ లోకి మారాల్సి వచ్చిందంటున్నారు.

మొత్తానికి ఈటల వ్యవహారంపై అధిష్టానం సైలెంట్ గా తన పని కానిచ్చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈటలపై పీకల్దాకా కోపమున్నా, ఇప్పటికిప్పుడు పక్కనబెడితే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్న భయంతోనే కేసీఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారని అంటున్నారు. అయితే, ఈటల బాటలోనే మరికొందరు ధిక్కార స్వరం వినిపించడం హైకమాండ్ కు మింగుడుపడటం లేదట. ఈటలపై లోలోపల రగిలిపోతున్న అధిష్టానం... సైలెంట్ గా ఆపరేషన్ మొదలుపెట్టేసిందట. డైరెక్టుగా పొమ్మనలేక పొగబెడుతోందట. మరి ఈటల ఎపిసోడ్ ఎండ్ ఎలా ఉంటుందో... ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.