ఎర్రబెల్లి అంతర్యం ఏమిటి?

 

ఈ రోజు తెదేపా నేత పయ్యావుల శాసనసభలో చేసిన ప్రసంగంలో తెరాసను తీవ్రంగా పట్టుబట్టారు గనుక తెరాస నేతలు ఆయనను వ్యతిరేఖించడం సహజమే. కానీ, తేదేపాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పయ్యావుల ప్రసంగాన్నితీవ్రంగా వ్యతిరేఖిస్తూ మాట్లాడటం విశేషం. తెదేపా నేతలు ప్రాంతాల వారిగా చీలిపోయినా, నేటికీ ఒకే పార్టీ గొడుగు క్రింద అందరూ కొనసాగుతున్నారు. అటువంటప్పుడు ఎర్రబెల్లి మీ సీమాంధ్ర పెత్తనం మాకవసరం లేదని నిర్ద్వందంగా చెప్పడమే కాకుండా ఏ కర్నూలుకో వెళ్ళి రాజధాని ఏర్పాటు చేసుకోమని పయ్యవులకు ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయన పయ్యావులని ఉద్దేశ్యించి అన్నపటికీ, తెలంగాణాలో కూడా తెదేపాను నిలబెట్టుకొందామని ఆరాటపడుతున్నచంద్రబాబుకి కూడా ఆయన అదే మాట చెప్పదలచుకొన్నారా? అనే ప్రశ్నతలెత్తుతుంది. ఎర్రబెల్లి ఉద్దేశ్యం అదే అయినట్లయితే మరటువంటప్పుడు ఆయన ఇంకా తెదేపాలో కొనసాగడంలో ఔచిత్యమేమిటి? తెలంగాణపై సీమాంధ్రుల పెత్తనాన్ని ఖండిస్తున్నఎర్రబెల్లి మరి ఇంకా చంద్రబాబు క్రింద ఎందుకు పనిచేస్తున్నట్లు? అని ప్రశ్నిస్తే వేరే గత్యంతరం లేకనే అని అనుకోవలసి వస్తుంది.

 

నాగం జనార్ధన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ తదితరులు పార్టీని వీడి బయటకి వెళ్లి ఏవిధంగా అపసోపాలు పడ్డారో చూశారు. గతేడాది తెదేపాను వీడి తెరాసలో చేరిన కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటో కూడా స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఇవన్నీ చూసిన తరువాత ఎర్రబెల్లి అంత సాహసం చేయలేకపోతున్నారు. అందువల్ల వేరే పార్టీలోకి వెళ్లేందుకు లేదా స్వయంగా పార్టీని స్థాపించేందుకో సాహసం చేయలేని ఎర్రబెల్లి సీమాంధ్ర పెత్తనాన్నిసహించబోమని చెపుతున్నపటికీ, తెదేపా అండదండలు లేకపోతే తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందనే సంగతి గ్రహించినందునే ఆయన ఇంకా తెదేపాను అంటిపెట్టుకొన్నారని భావించవచ్చును. అంతే గాక, ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణా ఏర్పడితే అక్కడ తెదేపాకు తానే నేతృత్వం వహించాలనే ఆశ కూడా ఉండి ఉండవచ్చును. కానీ ఒక అచ్చమయిన తెలంగాణావాదిగా అప్పుడప్పుడు ఈవిధంగా తన అక్కసు వ్రేళ్లగ్రక్కుతుంటారు.