ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంపముంచిన అశోక్ బాబు!!

 

చంద్రబాబుకి మెజారిటీ ఉద్యోగులు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఆ విషయం రుజువైంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు.. ఉద్యోగులు తమకి అనుకూలంగా ఉన్నారని, ఈసారి వారంతా టీడీపీ పక్షానే నిలుస్తారని భావించారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక బాబు అంచనా తప్పని తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా వైసీపీనే సత్తాచాటింది. ఉద్యోగులు బాబుకి వ్యతిరేకంగా ఉన్నారని తేలిపోయింది.

అయితే బాబు.. ఉద్యోగులు తమ పక్షాన ఉన్నారని నమ్మడానికి ప్రధాన కారణం ఎమ్మెల్సీ అశోక్ బాబు అని చెప్పాలి. ఉద్యోగ సంఘాల నేత అని, ఉద్యోగులంతా తమ పక్షాన నిలుస్తారన్న ఆశతో.. బాబు అశోక్ ని నెత్తిన పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ కట్టబెట్టారు. అశోక్ కూడా 'మీకు నేను ఉన్నాను.. ఉద్యోగులంతా మనవైపే ఉంటారు' అని చెప్పారు. ఇంకేముంది బాబు ఆహా ఓహో అంటూ గాలిలో తేలిపోయారు. గంపగుత్తగా ఓట్లన్నీ తమకే పడతాయి అనుకున్నారు. కానీ ఫలితాలు పూర్తీ భిన్నంగా వచ్చాయి. పార్టీ వల్ల అశోక్ కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కానీ, అశోక్ వల్ల పార్టీకి అసలు ఓట్లే రాలేదు. ఆయన ఉద్యోగుల ఓట్లు గానీ, తన సామజిక వర్గం ఓట్లు గానీ రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. బాబు ఆయన్ని గుడ్డిగా నమ్మి భ్రమల్లోకి వెళ్లారు. తీరా ఫలితాలు చూసాక కళ్ళు బైర్లు కమ్మాయి.

బాబు మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ.. గడిచిన ఐదేళ్ళలో ఒక సంఘటన మాత్రం ఉద్యోగుల మీద బాగా ప్రభావం చూపిందనే అభిప్రాయం ఉంది. అదే ఎమ్మార్వో వనజాక్షి పై చింతమనేని ప్రభాకర్ వర్గం దాడి చేయడం. ఆ విషయంలో బాబు.. చింతమనేని పక్షాన నిలిచారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అశోక్ బాబు వంటి వారిని గుడ్డిగా నమ్మకం, చింతమనేని వంటి వారిని వెనకేసుకురావడం వంటివి బాబు కొంపముంచాయనే చెప్పాలి.