టిడిపి ఓటమిలో నా పాత్ర కూడా ఉంది.. భావోద్వేగానికి లోనైన బాబు

 

ఒక్క విజయం వెయ్యేనుగుల బలాన్నిస్తుంది. ఒక్క పరాజయం అనేక పాఠాలు నేర్పుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో అంతర్మథనం సాగుతుంది. ఎన్నికల్లో ఓటమికి దారి తీసిన కారణాలపై ఇప్పటికీ అంతర్గత విశ్లేషణ జరుగుతుంది. ఇది నిరంతర కార్యక్రమం అయినప్పటికీ ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చోపచర్చలకు దారి తీసింది. ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఒక్కో జిల్లాలో 3 రోజుల పాటు బస చేసి పార్టీ సర్వసభ్య సమావేశం, నియోజక వర్గాల సమీక్షలు వంటివి చేపడుతున్నారు. పనిలో పనిగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడిలో గాయపడిన తెలుగుదేశం నేతలను పరామర్శిస్తున్నారు. జిల్లాలోని నియోజక వర్గాల ఇన్ చార్జిలతో లంచ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్ఆర్ కడప జిల్లాలో చంద్రబాబు 3 రోజుల పాటు పర్యటించారు. ఆ పర్యటన అనంతరం విజయవాడలో ఏర్పాటైన పార్టీ అగ్రనేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమిలో నా పాత్ర కూడా ఉంది అని వ్యాఖ్యానించారు. బాబు నోట ఆ మాట విన్న తెలుగు తమ్ముళ్లు బిత్తరపోయారు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. 

గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తమ్ముళ్లకు చంద్రబాబు వివరంగా చెప్పుకొచ్చారు. విభజిత రాష్ట్రం ఎలాగైనా కష్టాల నుంచి గట్టెక్కాలని ఆశించాను. రాష్ట్రాభివృద్ధి రాజధాని పోలవరం వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారించాను రాష్ర్టానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలన్న ఆరాటంలో పడి పార్టీ బాగోగులను విస్మరించాను ఈ లోపు పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల్లో నైరాశ్యం అలుముకుంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావనలోకి వెళ్లిపోయారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో వారు చురుకుగా పని చేయలేదు అని చంద్రబాబు గత అనుభవాలను వరుసగా ప్రస్తావించారు. ఇప్పుడు జిల్లాలో పార్టీ సమావేశాలకు వెళ్తుంటే ఈ విషయాలన్నీ స్పష్టంగా బోధపడుతున్నాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే ఒక నేత కల్పించుకున్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను ద్వితీయ శ్రేణి నేతలను పట్టించుకోవాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పార్టీ పెద్దలు వినలేదని పైగా మాట చెప్పిన వారిని దోషులుగా చూశారని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ముందు పార్టీయే ముఖ్యం కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలను చూసిన తరువాతనే మిగతా విషయాలను పట్టించుకుంటాను అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమ కోసం సమయం కేటాయించలేదని అనేక మంది నేతలు జిల్లా సమీక్ష సమావేశాల్లో చెబుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ అంశం తనను బాధిస్తోందని ఆయన పదేపదే చెప్పారు. 

చంద్రబాబు ఆవేదనను గమనించి కొందరు ముఖ్య నేతలు సైతం బాధను వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చెబితే వినిపించుకోలేదు. ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనం ఇకనుంచైనా కార్యకర్తలను పట్టించుకోవాలని నిర్ణయించుకోవడం శుభసూచికం అని వారు అంతర్గతంగా వ్యాఖ్యానించారు. జిల్లాల పర్యటనలో చంద్రబాబు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుస్తున్నాయి. ఆయనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అని కూడా కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ 6 నెలలలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజా సమస్యల పై పోరాటాలు చేస్తూ ముందుకెళ్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అని ఇంకొందరు సూచించారు. చూడాలి మరి వచ్చే రోజుల్లో చంద్రబాబు దిశానిర్ధేశం ఎలా ఉంటుందో చూడాలి.