ఒక ట్రంప్, ఒక మోదీ లాంటి మిసెస్ మెరైన్ ను ఫ్రాన్స్ మిస్సైందా?

 

భారతీయులకి అమెరికా అంటే వుండే ఆరాటం మరే దేశం పేరు చెప్పినా వుండదు. కాని, ప్రపంచ రాజకీయాల్ని ప్రభావితం చేసే అభివృద్ధి చెందిన ఫ్రాన్స్. యూరప్ లో అయితే ఫ్రాన్స్ పాత్ర మరీ కీలకం. ఎప్పుట్నుంచో అక్కడ ఒక సామెత కూడా వాడుకలో వుంది. ఎప్పుడైతే ఫ్రాన్స్ తుమ్ముతుందో … అప్పుడు యూరప్ కి జలబు చేస్తుందీ అని! అది ఇప్పుడు ఒకప్పటంత నిజం కాకపోయినా… ఇంకా యూరోపీయన్ యూనియన్ లో ఫ్రాన్స్ అత్యంత ప్రధాన దేశం! ఆ దేశానికి సరికొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలుసు కదా? ఎమ్మాన్యువల్ మాక్రోన్…

 

అమెరికా లాగానే ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ వుంటుంది ఫ్రాన్స్ లో. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అయితే, ఈసారి ఆశ్చర్యకరంగా ఒక ఇండిపెండెంట్ అయిన ఎమ్మాన్యువల్ మాక్రోని గెలిచాడు. అదీ దాదాపు 65శాతం ఓట్లతో! అంతగా ఆయనలో ఫ్రెంచ్ వారికి నచ్చింది ఏంటి? మరేం లేదు… చారిత్రకంగా కూడా ఫ్రాన్స్ ప్రజలు ఆదర్శవాదులు, స్వేచ్ఛా ప్రేమికులు. ప్రజాస్వామ్యం గురించి చెప్పేటప్పుడు తప్పక చెప్పే స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి పదాలన్నీ అక్కడే ఊపిరి పోసుకున్నాయి. అక్కడ విప్లవాలు మొదలయ్యేక యూరప్ అంతటా మార్పు మొదలైంది. ఇవాళ్ల ప్రజాస్వామ్యం ప్రపంచాన్ని ఆవరించిందంటే అది ఫ్రాన్స్ లో మొదలైన పరిణామమే! ఇప్పుడు ఆ నేపథ్యమే మాక్రోన్ ని ఎన్నుకునేలా చేసింది!

 

ఫ్రాన్స్ లో కూడా ఇండియా, అమెరికా లాంటి దేశాల్లో జరిగిన తాజా ఎన్నికల్లాగే పోరు నడిచింది. అమెరికాలో ఆదర్శవాద వర్గానికి చెందిన హిల్లరీని ట్రంప్ ఆశ్చర్యకరంగా ఓడించాడు. అంతకు ముందే, ఇండియాలోనూ మోదీ లెక్కలన్నీ తారుమారు చేశాడు. ఒక రైట్ వింగ్ లీడర్ స్వంత మెజార్టీతో భారత ప్రధాని అవ్వటం ఎవ్వరూ ఊహించగలిగింది కాదు కొన్నాళ్లు కిందటి వరకూ! కాని, మీడియాని, మేదావుల్ని అందరూ షాక్ కి గురి చేస్తూ ఒక ఆరెస్సెస్ ప్రచారక్ దేశ సారథ్యాన్ని చేపట్టాడు! ఫ్రాన్స్ లోనూ ఈసారి పోటీ ఇలాంటి భిన్న ధృవాలే మధ్యే జరిగింది!

 

ఎమ్మాన్యువల్ మాక్రోన్ లిబరల్. అంటే, మన దగ్గరి కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల వంటి వాడన్నమాట. ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ లో వుండాలనీ, వలస వచ్చే వార్ని అక్కున చేర్చుకోవాలనీ, జాతీయ వాదం పెద్దగ అక్కర్లేదని వాదించేవాడు. ఆయనతో పోటీ పడ్డ మెరైన్ లీ పెన్ పక్కా రైటిస్ట్. అంటే, ఆమె మాటల్లో , చేతల్లో ఫ్రాన్స్ ఫస్ట్ ఉద్దేశం ఇట్టే పసిగట్టవచ్చు. జాతీయ వాదమే కాదు మెరైన్ ఫ్రాన్స్ లోకి వచ్చిన ముస్లిమ్ వలస వాదుల్ని కూడా టార్గెట్ చేశారు. వాళ్లు మన దేశాన్ని ఆక్రమించారనీ… వారి నుంచీ ఫ్రాన్స్ ను కాపాడుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. కాని, కేవలం 35శాతం ఓటర్లు మాత్రమే మెరైన్ వెంట నిలిచారు. అంతకు రెట్టింపు జనం అభ్యుదయ భావాల గల ఎమ్మాన్యువల్ కే ఓటు వేశారు!

 

ఫ్రాన్స్ లో ఒక ఇండిపెండెంట్ అద్భుతంగా గెలవటంతో కథ సుఖాంతం కాలేదంటున్నారు విశ్లేషకులు. పైకి జాతీయవాదం వినిపించిన మెరైన్ ఓడిపోయినట్టు కనిపించినా అసలు జరిగింది వేరంటున్నారు. ఆమె పార్టీకి ఒకప్పుడు 4.5మిలియన్లు ఓట్లు వస్తే ఈ సారి ఎన్నికల్లో 11మిలియన్ ఓట్లు వచ్చాయి! ఇంత పెరుగుదల ఫ్రాన్స్ లోనూ రాజుకుంటున్న అసంతృప్తి నిప్పుకి నిదర్శనం అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేద్దాం,మనకు ఫ్రాన్స్ ముఖ్యం, వలస జనాలతో దేశ భద్రతకి ముప్పు వుంది లాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన మెరైన్ ఎక్కువ ఓట్లు కొల్లగొట్టింది 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సులోని ఓటర్ల నుంచే! అంటే, ఈ సారి ఎన్నికైన మాక్రోన్ ఫ్రాన్స్ లో క్రమంగా పెరుగుతోన్న నిరుద్యోగం, గ్లోబలైజేషన్ పై అసంతృప్తి, ఈయూ విషయంలో అసహనం వంటి వాట్ని సరిగ్గా డీల్ చేయకుంటే … వచ్చే ఎన్నికల్లో కరుడుగట్టిన మెరైన్ లీ పెన్ దే విజయమంటున్నారు ఎక్స్ పర్ట్స్!

 

ఒక్క ఫ్రాన్సే కాదు… ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అటుఇటుగా ఒకే ట్రెండ్ నడుస్తోంది. జాతీయ వాదాన్ని పక్కన పెట్టే నాయకుల్ని క్రమక్రమంగా జనం ఆదరించటం మానేస్తున్నారు. దేశం కంటే మానవత్వం, సెక్యులరిజమ్, ఆదర్శవాదం గొప్పవనే వార్ని కూడా ఓటర్లు నమ్మటం లేదు. గ్లోబలైజేషన్ వల్ల నిరుద్యోగంతో సతమతం అవ్వటం అనివార్యం అవ్వటంతో అభివృద్ధి చెందిన దేశాల యువత కూడా అసహనానికి గురవుతోంది! ఈ కామన్ ట్రెండ్స్ ని ఇండియా మొదలు ఫ్రాన్స్ వరకూ అన్ని దేశాల లిబరల్, సెక్యులర్ నాయకులు గమనించి ముందుకు సాగాలి. ఊరికే మాటలకే పరిమితమైపోతే… ముందు ముందు ప్రపంచమంతా ట్రంప్ లు, మోదీలదే అవుతుంది!