2014 లో ఈవీఎం టాంపరింగ్..ఈసీ ఫిర్యాదు

 

గత సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా రిగ్గింగ్‌ జరిగిందంటూ సయ్యద్‌ షుజా అనే సైబర్‌ నిపుణుడు చేసిన ప్రకటన దేశంలో రాజకీయ దుమారానికి దారితీసింది. సయ్యద్‌ షుజా లండన్‌లో భారత పాత్రికేయ సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను అభివృద్ధి చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకూ తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయవచ్చా అన్నది పరిశీలించాలని ఈసీఐఎల్‌ తన బృందాన్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. తన ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని, ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే హ్యాకింగ్‌ తీరును వివరిస్తా అంటూ సంచలన ప్రకటన చేశారు. కాగా.. షుజా ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అతడిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. షుజా చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి, తగిన దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ పోలీసులకు ఈసీ లేఖ రాసింది.