తాజ్ మహల్‌ను కూల్చేయండి..!!

తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నం.. ఇప్పటికీ ప్రేమికులకు, ప్రేమించిన వారికి గిఫ్ట్ ఇవ్వాలంటే మొదటగా తట్టేది తాజ్ మహల్ రూపమే.. అంతెందుకు ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడాల్లో తాజ్ మహల్ ఒకటి.. అలాంటి తాజ్‌ మహల్‌ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. పర్యావరణ కాలుష్యం నుంచి తాజ్ మహల్‌ను సంరక్షించేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఓ పర్యావరణవేత్త దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరించింది.

 

 

కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని.. మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి.. తాజ్‌ మహల్‌ నిర్వహణా లోపాలను సరిదిద్దండి.. లేకపోతే దాన్ని కూల్చేయండి అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కంటే మన తాజ్‌ మహల్‌ ఎంతో సుందరమైందని.. టీవీ టవర్ లాంటి ఈఫిల్ టవర్‌ను చూడటానికి ఏటా 8 మిలియన్ల మంది వెళ్తున్నారు.. మన తాజ్ దానికంటే ఎంతో అందమైంది.. సరైన నిర్వహణ చర్యలు చేపడితే భారత్‌కు ఆర్థికంగా తోడ్పడుతుంది.. విదేశీ కరెన్సీ లోటును భర్తీ చేస్తుంది అని అభిప్రాయపడింది.. ఇప్పటికైనా ఆ అద్భుత కట్టడాన్ని పరిరక్షించకపోతే దాన్ని మూసివేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది.