ఎర్త్ డే జరుపుకునే మనం… ఎవ్రీ డే ఏం చేస్తున్నాం?

 

భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉదయాన్నే లేవగానే ఒక ప్రార్థన చేస్తారు! అదేంటంటే… విష్ణు పత్ని అయిన భూమాతకి నమస్కారం. నీపైన కాళ్లు మోపుతున్నందకు మమ్మల్ని క్షమించు తల్లీ అనీ! ఇది పైకి ఏదో మూఢ భక్తిలా అనిపిస్తుంది! కాదంటే, హిందువుల విశ్వాసం అని సరిపెట్టుకోవచ్చు. కాని, అంతర్లీనంగా ఎంతో గొప్ప ఉపదేశం, ఉపయోగం వున్నాయి! ఏప్రెల్ 22 ప్రపంచ భూమాతా దినోత్సవ సందర్భంగా మనం ఒక్కసారి అదేంటో తరచి చూద్దాం!

 

భూమిని భూమాతగా ఎందుకు భావించాలి? నిజానికి మనిషికి ప్రాణంపోసేది, ప్రాణం నిలిపేది ఏది అయినా తల్లితో సమానమే! అందుకే, నీటిని గంగమ్మ అన్నట్టు భూమిని భూమాతా అన్నాం. కాని, భూమికి మరోక ప్రత్యేకత కూడా వుంది. అదే… మనిషితో పాటూ అన్ని జీవుల్ని అంతిమంగా భూమే తనలో కలుపుకుంటుంది! పైగా మనం పుట్టింది కూడా భూమి నుంచే మన సనాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఎలాగంటే, భూమి నుంచి ఆహారం ఉత్పత్తి అవుతోంది. ఆ ఆహారం స్వీకరించిన తండ్రిలో … ఆహారం కారణంగానే శుక్ర కణం ఉత్పత్తి జరుగుతోంది. అది తల్లి కడుపులోకి చేరి అండంతో కలిసి పిండంగా మారి ప్రాణంగా బయటకొస్తోంది! ఆ విధంగా భూమ్మీది జీవులన్నిటికి ఆహారం పెట్టే భూమే… సకల జీవరాశికి తల్లి!

 

మాతృమూర్తి లాంటి భూమాతని భూమ్మీది మరే జీవీ ఇబ్బంది పెట్టడం లేదు. దోచుకోవడం లేదు. నష్టపర్చటం లేదు. మనిషి మాత్రమే ఉన్మాదంతో భూమిని అస్తవ్యస్తం చేస్తున్నాడు. భూమిపైని పచ్చదనం నరికేస్తున్నాడు. భూమి లోపలి ఘనుల్ని తోడేస్తున్నాడు. నేల లోపలి జల సిరుల్ని విచ్చలవిడిగా వాడుకుని… కాంక్రీట్ అరణ్యాలు సృష్టించి.. భవిష్యత్ తరాలకు కన్నీళ్లే తప్ప నీళ్లు లేని దుస్థితి తెస్తున్నాడు! ఇంతా చేసి సంవత్సరానికి ఒక రోజు, ఏప్రెల్ 22న, ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే జరుపుకుంటున్నాడు. మిగతా అన్ని రోజులు తన రాక్షసత్వం కొనసాగిస్తున్నాడు!

 

ఎర్త్ డే నిజానికి 1970లలో అమెరికాలో మొదలైంది. పారిశ్రమిక విప్లవానికి వ్యతిరేకంగా జనం నిరసనలు తెలుపుతూ కార్యక్రమాలు నిర్వహించారు. కాని, పారిశ్రమలు మాత్రం ఆగలేదు. వాయు, ధ్వని, భూ కాలుష్యమూ ఆగలేదు. 2009కల్లా భూమి విషవాయువులతో గతంలో ఎప్పుడూ లేనంతగా వేడెక్కింది. అప్పుడు యూఎన్ఓ అమెరికా వారు మొదలు పెట్టిన ఎర్త్ డేను అంతర్జాతీయ భూమాతా దినోత్సవంగా ప్రకటించింది! ఎర్త్ డే.. మదర్ ఎర్త్ డే అయినా కూడా మానవ సమాజంలో పెద్దగా మార్పు వచ్చిందేం లేదు! 2009 తరువాత కూడా ఎర్త్ డేలు జరుపుకుంటూనే ఎర్త్ ను దోచుకుంటూ, దోపిడీ చేసే పనులు చేస్తూనే వున్నాం!

 

ఊళ్లకు ఊళ్లు నిర్వీర్యం చేసే భారీ పరిశ్రమలు మొదలు ఒక్కొక్కరూ వాడేసే ఏసీలు, వాహనల వరకూ అంతా కాలుష్యమే! ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే… భూమ్మీది ఏ ప్రాంతమూ కలుషితం కాకుండా లేదు. సముద్రాలు కూడా మనిషి స్వార్థానికి బలైపోతున్నాయి. వాటిల్లో పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ధృవ ప్రాంతాల వద్దకు వెళ్లి తేలుతున్నాయట! గ్రీన్ ల్యాండ్ నుంచీ అంటార్కిటికా వరకూ ఎక్కడా స్వచ్ఛత లేకుండా పోయింది! ఎర్త్ డే నాడు అందరూ ఆందోళన చెందాల్సిన విషయం ఇదే!

 

భూమిని మనిషిని ఇలాగే పరాభవిస్తూ పోతే ముందు ముందు అది తన అంతానికే ఆరంభం అవుతుంది! ఒక్కసారి సహనానికి ప్రతి రూపమైన భూమాత ఆగ్రహిస్తే భూకంపాలు మొదలైపోతాయి. సునామీలు ముంచుకొస్తాయి. ప్రళయం అనివార్యమవుతుంది. అప్పుడు ఎర్త్ డే జరుపుకోటానికి మానవ సమూహమంటూ మిగలటం కూడా అనుమానమే! అణు యుద్ధాలు వస్తాయో రావో తెలియదు. కాని, మనిషి తన సుఖం కోసం, స్వార్థం కోసం చేస్తోన్న కాలుష్యంతో… భూ ప్రళయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది! మానవ నాగరికత అణువణువూ వణికిపోతుంది. అది జరగక ముందే జాగ్రత్తపడాలి!