మోదీ పన్నే ‘కమల’వ్యూహంలో… చిన్న పార్టీలు చిక్కాల్సిందేనా?

భారతదేశ చరిత్రలో తన స్వంత మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రధాని అయిన కాంగ్రేసతర పార్టీ నాయకుడు… మోదీ! 2014లో ఇదో అద్భుతం! నిజానికి అంతా మోదీ ఇచ్చిన కాంగ్రెస్ హఠావ్ నినాదం నిజమైపోతుందని భావించారు కూడా! కానీ, నాలుగేళ్లు పూర్తై మరో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ మోదీ గ్రాఫ్ క్రమంగా దెబ్బతింటూ వస్తోంది. 2019లో మళ్లీ మోదీ ప్రధాని అవుతారా? అవును అని బీజేపీ కార్యకర్తలు, అభిమానులే చెప్పలేని స్థితి!

 

 

ఇప్పటికీ నరేంద్ర మోదీకి వున్న ఏకైక బలం… ప్రతిపక్షాలకు బలమైన ప్రధాని అభ్యర్థి లేకపోవటమే! రాహుల్ తప్ప మరెవరూ మోదీకి పోటీ ఇచ్చే స్థితి  లేదు. అలాగని రాహుల్ ఓటర్లందరికీ ఆశాజ్యోతిలా వున్నాడా అంటే … అదీ లేదు. మోదీ వద్దనుకునే వారు ఎందరున్నా రాహుల్ కావాలనుకునే వారు అందరు లేరు! ఇక మిగతా నాయకులదైతే మరీ సాదాసీదా పరిస్థితి. ఎవ్వర్నీ వారి పక్క రాష్ట్రంలో గుర్తించే వారు లేరు! ఇదే మోదీకి అతి పెద్ద ప్లస్ పాయింట్. కానీ, కేవలం బలహీనమైన ప్రతిపక్షం కారణంగా 2019లో నమో మరోసారి స్పష్టమైన మెజార్టీ తెచ్చుకుంటారా? డౌటే!

వచ్చే ఎన్నికలపై మనకి కాదు… స్వయంగా మోదీ, అమిత్ షాలకు కూడా అనుమానాలు వున్నట్టు కనిపిస్తోంది. పైకి అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా మళ్లీ అధికారం తమదేనని గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ, అదంత తేలిక కాదని కమలనాథులకి తెలుసు. ఆరెస్సెస్ వారికి ఇంకా బాగా తెలుసు. అందుకే, రకరకాల వ్యూహాలతో ప్రతిపక్షాల్ని ఇరుకున పెడుతున్నారు. ఎలాగైనా మాయ చేసి వచ్చే ఎన్నికల్లోనూ మోదీనే ప్రధానిగా పీఠంపై కూర్చోబెట్టాలని ఆరెస్సెస్ పెద్దలు, అమిత్ షా పని చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగమే జమిలి ఎన్నికల హడావిడి!

 

 

జమిలి విషయంలో దేశంలోని అన్ని పార్టీల అభిప్రాయాలు కోరింది లా కమీషన్! బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకూ తమ అభిప్రాయాలు చెప్పలేదు. మిగిలిన చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీల ఉద్దేశ్యాలు మాత్రం తెలుసుకునే  ప్రయత్నం చేసింది కేంద్రం. సహజంగానే మమతా బెనర్జీ లాంటి వారు నో అన్నారు. కేసీఆర్ లాంటి వారు ఓకే అన్నారు. టీడీపీ లాంటి పార్టీలు జమిలికి సై అన్నా ముందస్తుకి నై అనేశాయి. అంటే, మొత్తంగా జమిలిపై భిన్నాభిప్రాయాలే వెలువడ్డాయన్నమాట. ఇక మిగిలిన ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లలో కాషాయ పార్టీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలాగూ ఓకే! బీజేపీ చెప్పింది కాంగ్రెస్ ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి హస్తం పార్టీకి జమిలి సమ్మతం కాదు. ఇదీ పరిస్థితి!

అసలు ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు పెద్దగా వర్కవుట్ కాదని అనిపిస్తోన్న జమిలి ఎన్నికల విషయంలో మోదీ ఇంత పట్టుదలగా ఎందుకున్నారు? పైకి ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, సంక్షేమ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం వుండదనీ చెబుతున్నప్పటికీ అసలు కారణం అంతరంగంలో వుంది! గతంలో డీమానిటైజేషన్ పేరుతో మోదీ వేసిన అడుగు కూడా ఇలాగే పైకి చాలా ఆదర్శవంతంగా కనిపించింది. కానీ, బ్లాక్ మనీ రాబట్టలేకపోయిన నోట్ల రద్దు తరువాత జరిగిన చాలా ఎన్నికల్లో బీజేపీకి ఉపయోగపడింది. ఇతర పార్టీలు ఎలక్షన్ టైంలో చేతిలో డబ్బులు లేకలేక విలవిలలాడిపోయాయి. ఈ పరిణామం బీజేపీ విజయాల్ని చాలా రాష్ట్రాల్లో సునాయాసం చేసింది. ఇప్పుడు జమిలి ఎన్నికల వ్యూహం కూడా అలాంటిదేనని భయపడుతున్నాయి దేశంలోని చాలా పార్టీలు!

 

 

ఒకేసారి కేంద్రానికి , రాష్ట్రాలు అన్నిటికీ ఎన్నికలంటే చిన్న పార్టీలకు ఆర్దిక భారం ఎక్కువైపోతుంది. అదే సమయంలో బీజేపీ లాంటి పెద్ద పార్టీకి పోల్ మ్యానేజ్ మెంట్ తేలికవుతుంది. రెండు నెలల కాలంలో మొత్తం రాజకీయ వ్యవహారమంతా చక్కబెట్టేస్తే అయిదేళ్లు ఇక పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టవచ్చు. అలాగే, ఇప్పుడు బీజేపీ కమలం గుర్తు కంటే మోదీ ముఖమే ఎక్కువగా ఓట్లు రాబడుతోంది. అన్ని అసెంబ్లీలకూ ఎన్నికలు ఒకేసారి వస్తే ప్రధాని అభ్యర్థిగా మోదీ చేసే ప్రచారం శాసనసభలపై కూడా వుంటుంది. జనం మోదీ ఛరిష్మా ప్రభావంతో అసెంబ్లీ సీట్లకు కూడా ఓటు వేసే అవకాశం వుంది. ఇలా అనేక కారణాలు బీజేపీకి ప్లస్ గా మారతాయి ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలైతే!

కొన్ని పార్టీలు ససేమీరా అంటున్నా మోదీ ఈ సంవత్సరం చివరికల్లా ముందస్తు ఎన్నిలకు వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఆగస్ట్ 15న ఆదాయ పన్ను రద్దు చేస్తున్నట్టు ఆయన ఎర్రకోటపై నుంచీ ప్రకటిస్తారని టాక్ వినిస్తోంది. కోర్టులో వున్న అయోధ్య రామ మందిరం కేసు కూడా ఎలానూ వుండనే వుంది. ఇలా అనేక దిక్కుల్లోంచి ఓటర్లను మెస్మరైజ్ చేసే నిర్ణయాలు తీసుకుని ఎన్నికల బరిలోకి దూకవచ్చు. ఇక ఇప్పుడు అత్యధిక శాతం రాష్ట్రాలు కూడా కమలానివే కాబట్టి వాట్ని కూడా ఓట్ల యద్ధంలోకి దింపవచ్చు. మొత్తం మీద ఏకాభిప్రాయం రాకున్నా 2018 చివర్లో మనం ఓ మోస్తరు జమిలి ఎన్నికల్ని ఎదుర్కోక తప్పదు. వాటి ఫలితాలు మోదీకి అనుకూలంగా వుంటే మాత్రం … చిరు పార్టీల భయాలు నిజమేనని తేలిపోతుంది!