కేసీఆర్ ‘ముందస్తు’వ్యూహంలోని ‘ముందుచూపు’ ఇదేనట!

దేశంలో ముందస్తు ఎన్నికల కోసం తహతహలాడుతున్న నేతలెవరు? ఇంతకాలం మీడియా మోదీ పేరే చెబుతూ వచ్చింది. ఈ సంవత్సరం చివర్లో ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికలతో పాటూ దేశ పార్లమెంట్ కు కూడా ఎన్నికలు తీసుకురావలని ప్రధాని ఆలోచిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు అలాంటి ఆలోచనలో వున్నట్టుగా మోదీ కనిపించటం లేదు. 2019 వేసవిలోనే ఎలక్షన్స్ వచ్చేలా వున్నాయి. అయితే, అదే జరిగితే గత ఎన్నికల మాదిరిగా రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా అప్పుడే ఓటింగ్ జరుగుతుంది. కానీ, అందుకు సిఎం కేసీఆర్ సిద్ధంగా లేరని తాజా టాక్!

 

 

పార్లెమెంట్ ఎన్నికలతో పాటూ తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ జరిగితే కేసీఆర్ కి ఏంటి నష్టం? పైకి సూటిగా కనిపించకపోయినా ఓ పెద్ద సమస్యే వుంది. మోదీ తీసుకున్న జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను కలుగజేశాయి. జనం మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పెద్ద సంఖ్యలోనే ఎదురుచూస్తున్నారు. కానీ, పోయిన ఎన్నికల వేళ మోదీ హవా పూర్తిగా వీస్తుంటే కూడా తెలంగాణలో కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు వచ్చింది కమలానికి. అటువంటిది ఇప్పుడు అయిదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో 2019లో ఎన్నికలకు వెళితే తెలంగాణలో కాషాయానికి దక్కేది ఎంత? సున్నా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మళ్లీ ఒక్క ఎంపీ సీటు నిలబెట్టుకుంటే అంతకంటే ఆనందం మరొకటి వుండదు. ఇటువంటి పరిస్థితిలో అమిత్ షా తెలంగాణపై పెద్దగా ఆశలు పెట్టుకోరన్నది స్పష్టం!

 

 

ఎంపీ సీట్ల విషయానికి వచ్చే సరికి జనం అసెంబ్లీ కంటే భిన్నంగా ఆలోచిస్తారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా… బీజేపీ మీద వ్యతిరేకతతో వున్న జనం ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా వుంటుంది. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను ముందస్తుకు సిద్ధం చేస్తోన్న అంశంగా కనిపిస్తోంది. మోదీ నిర్ణయాలు నచ్చని వర్గాలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎన్నుకుంటే టీఆర్ఎస్ ఇంతకు ముందు వచ్చినన్ని ఎంపీ సీట్లు రాకపోవచ్చు. అదే సమయంలో ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకూల గాలి వీస్తే ఎమ్మెల్యే స్థానాల గెలపు ఓటములపై కూడా దాని ప్రభావం వుంటుంది. మొత్తంగా మోదీ, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చే ఎండాకాలం నాటికి పాకాన పడితే అది కాంగ్రెస్ కు మేలవుతుంది తప్ప టీఆర్ఎస్ కు ఏమంత కలిసొచ్చే అవకాశాలు లేవు. తన స్వంత ఓటు బ్యాంకు మీదే కేసీఆర్ నమ్మకం పెట్టుకున్నారు. అందుకే, ఆయన దిల్లీ టూర్లు వేస్తూ ముందస్తుకు ప్రధాని నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పొందారని గుసగుసలు వినిపిస్తున్నాయి!

 

 

నిజానికి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ఈ అక్టోబర్ లో ఎన్నికలకు రెడీ అయితే… నవంబర్, డిసంబర్లలో ఈసీ ఎన్నికల తేదీలు ప్రకటించవచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో తెలంగాణ కూడా ఎన్నికలకు వెళ్లవచ్చు. దీనికి మోదీ, అమిత్ షాల పర్మిషన్ ఏం అక్కర్లేదు కేసీఆర్ కి. కానీ, మోదీ చేత ఓకే చేయించుకోవటం ఎందుకంటే… కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తరువాత బాహాటంగా బీజేపికి మద్దతు ఇచ్చే అవకాశం వస్తుంది! తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ కి శత్రువు, దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ హస్తం గుర్తు బీజేపీకి టార్గెట్. ఇలా ఇద్దరికీ కాంగ్రెస్సే కామన్ ఎనిమీ కాబట్టి టీఆర్ఎ, బీజేపీ చేతులు కలపటం ఈజీ అవుతుంది. పైగా దిల్లీలో కేసీఆర్ కి మోదీ కావాలి, మోదీకి తెలంగాణలో కేసీఆర్ కావాలి. ఇలా ఇద్దరికి లాభసాటిగా వుంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ, కమలం కలిసి వికసించిన ఆశ్చర్యపోనక్కర్లేదు!

 

 

పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయటానికి ముందుగానే అసెంబ్లీ యుద్ధం ముగించటం ఎందుకంటే… బీజేపీతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకి వెళితే ముస్లిమ్ ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. డ్యామేజ్ ఏదైనా జరిగితే అసలుకే ఎసరు వస్తుంది. అలా కాకుండా రెండోసారి కూడా తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక దిల్లీపై దృష్టి పెడితే… మోదీ తిరిగి ఎన్నికైనా కాకున్నా తెలంగాణ వరకూ మాత్రం కార్ కు వచ్చే ఢోకా వుండదు. ఇదే కేసీఆర్ ముందస్తు గేమ్ ప్లాన్ అంటున్నారు పొలిటికల్ పండిట్స్! ఇందులో నిజం ఎంతో త్వరలోనే తేలిపోతుంది. కానీ, తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు నగారా మోగితే మాత్రం… అది ఖచ్చితంగా టీకాంగ్రెస్ కు టెన్షన్ పెట్టించే పరిణామమే!