ఇయర్‌బడ్ పెట్టుకుంటున్నారా? ఇబ్బందికి సిద్ధం కండి!

 

చెవిలో ఇయర్‌ బడ్‌ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. వారానికి ఓసారన్నా ఇయర్‌బడ్‌తో ప్రయోగాలు చేయనిదే మరికొందరికి నిద్రేపట్టదు. దీంతో నష్టం ఏముంది? మేము ఏ పెన్నో, పిన్నీసో చెవిలో పెట్టుకోవడం లేదు కదా! అంటారేమో. ఇయర్‌బడ్‌ కూడా చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు.

చెవిలో గుబిలి (ear wax) ఉండటం సహజమే! చెవిలో ఉండే సెబమ్‌, మృతకణాలతో ఈ పదార్థం ఏర్పడుతుంది. అది పనికిరాని పదార్థం అని మనకి అనిపించవచ్చు. కానీ ear wax వల్ల చాలా లాభాలే ఉంటాయంటారు వైద్యులు. చెవిలోకి తడి చేరకుండా, సూక్ష్మక్రిములు దాడిచేయకుండా ఇది కాపాడుతుంది. క్రమేపీ దానంతట అదే శరీరం నుంచి బయటకు వచ్చేసి ఎప్పటికప్పుడు కొత్తగా ear wax ఏర్పడుతూ ఉంటుంది.

చెవిని శుభ్రం చేసే ప్రయత్నంలో ఇయర్‌ బడ్స్‌ని తెగ వాడేస్తుంటాం. కానీ పొడవాటి ఇయర్‌ బడ్స్ వల్ల చెవిలోని మురికి మరింత లోపలకి చేరడమే కాదు, నేరుగా చెవిలోని సున్నితమైన భాగాలకు తగిలే ప్రమాదం ఉంది. దీంతో కర్ణభేరి దెబ్బతినడం, పుండు పడటం, సున్నితమైన భాగాలు గీరుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. టైం బాగోకపోతే వినికిడిని కలిగించే చిన్నచిన్న ఎముకలు కూడా దెబ్బతినిపోతాయి. అంతేకాదు! మన శరీరాన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచే వ్యవస్థ కూడా మన చెవిలోనే ఉంటుంది. దాంతో చెవిలోకి ఇయర్‌ బడ్‌ చేరినప్పుడు... తూలిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం వంటి సమస్యలూ ఏర్పడవచ్చు.

ఇయర్‌బడ్స్‌తో చెవిలో గుబిలిని తీసే ప్రయత్నంలో... ఒక్క అమెరికాలోనే రోజుకి 34 మంది పిల్లలు తీవ్రమైన గాయాలతో ఎమర్జన్సీ వార్డులలో చేరుతున్నారట. వీరిలో మూడింటి రెండు వంతుల మంది ఎనిమిదేళ్ల లోపువారే కావడం గమనార్హం. తెలిసీ తెలియని వయసు, ఆపై ఇయర్‌బడ్‌ని వాడాలన్నా కుతూహలంతో వీరంత గాయాలపాలవుతున్నారు. చిన్నగా, సున్నితంగా ఉండే వీరి కర్ణభేరీలను ఇయర్‌బడ్స్ ఛిద్రం చేసేస్తున్నాయి.

ఇయర్‌బడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలనీ, కనీసం పిల్లలకన్నా అవి అందుబాటులో లేకుండా చూసుకోవాలనీ చెబుతున్నారు. చెవిలో గుబిలి ఏర్పడిపోయి చిరాగ్గా ఉంటే వైద్యుడిని సంప్రదించడమే మేలని అంటున్నారు. ఇయర్‌బడ్స్‌తో మేకప్‌ వేసుకోవడం, గాయాలను శభ్రం చేసుకోవడం, వస్తువులను తుడుచుకోవడం... వంటి పనులు నిరభ్యంతరంగా చేయవచ్చు కానీ.... చెవులకు మాత్రం వాటిని దూరంగా ఉంచాలన్నమాట!

 

- నిర్జర.