బహిరంగంగానే తిట్టుకుంటున్న వైసీపీ నేతలు

ఏపీలో అధికార వైసీపీకి ఆ పార్టీ నాయకుల తీరు తలనొప్పిగా మారింది. ఇటీవల వైసీపీ నేతలు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో డీఆర్సీ సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధుల ముందే ఎంపీ విజయసాయిరెడ్డిపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఇదే సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎం ఆఫీస్ వద్ద డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి 'బుద్ధి, జ్ఞానం ఉందా నీకు.. డిప్యూటీ సీఎం వా నువ్వు' అని దుర్బాషలాడిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నువ్వెంతంటే నువ్వెంత అని వాగ్వాదానికి దిగారు. 

 

తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్లు విషయంలో కాకినాడలో అవినీతి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కేకలు వేశారు. ఒకే పార్టీ లో ఉంటూ నాకు చెప్పాలి కదా అని బోసుపై దుర్భాషలాడారు. మేడ లైన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ నగరం మునిగిపోయిందని కూడా బోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. ఈ విషయాలు తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు నచ్చజెప్పారు. దీంతో రాసభాస మధ్య సమావేశం అర్థాంతరంగా ముగిసిపోయింది.