దుర్గగుడి ఈవో సూర్యకుమారి బదిలీ

విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజల వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది. శాంతమూర్తిగా ఉన్న దుర్గమ్మను రౌద్రమూర్తిగా మార్చేలా వ్యవహరిస్తున్నారంటూ వేదపండితులు, సాంప్రదాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఆలయ ఈవో సూర్యకుమారి ఉన్నారని శాఖాపరమైన విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఆమెపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఈవో నియామకం జరిగే వరకు ఇన్‌ఛార్జ్ ఈవోగా దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధకు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖకు సూర్యకుమారిని ప్రభుత్వం సరెండర్ చేసింది. కాగా.. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ చాలా కాలంగా తన బంధువుకు ఆలయంలో ఉద్యోగం ఇప్పించాలని ఈవోని అడిగారని.. తాంత్రిక పూజలు చేయిస్తే.. ఆ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె ఆశ చూపించి ఈ పని చేయించినట్లుగా దర్యాప్తులో తేలినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.