రాజకీయ చదరంగంలో పావుగా మారిన ఐఏయస్ ఆఫీసర్

 

ఉత్తరప్రదేశ్ కి చెందిన దుర్గా నాగ్ పాల్ అనే 27ఏళ్ల ఐఏయస్ ఆఫీసర్ అధికార సమాజ్ వాది పార్టీ కాంగ్రెస్ పార్టీల మద్య జరుగుతున్నవికృత రాజకీయ క్రీడలో పావుగా మారిపోయింది. ఆమె నొయిడా జిల్లాలో గల కడల్పూర్ అనే గ్రామంలో అక్రమ నిర్మాణం చేస్తున్న ఒక మసీదు గోడని కూల్చి వేసి, మతఘర్షణలు చెలరేగేందుకు కారణమయ్యారని సమాజ్ వాది ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. అయితే, ఇసుక మాఫియాకు చెందిన కొందరు వ్యక్తులు, ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ సమయంలో మశీదు గోడను కూల్చివేసినట్లు స్థానికులు, వక్ఫ్ బోర్డు సభ్యులే చెపుతున్నారు.

 

కొందరు సమాజ్ వాది నేతల అండతో సాగుతున్నఇసుక మాఫియాను ఆమె  డ్డీ కొనడంతో, వారే ఆమెను తమకు అడ్డు తప్పించేందుకు ఇదంతా చేసినట్లు బయట పడటంతో దుర్గా నాగ్ పాల్ కు ఉత్తరప్రదేశ్ మీడియా తోబాటు జాతీయ మీడియా కూడా మద్దతుగా నిలిచింది.

 

అయితే దీని వెనుక ఒక ఆసక్తికరమయిన ఉపకధ కూడా ఉంది. మసీదు గోడ కూల్చిన సంగతి తెలియగానే, స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యుడు టాకూర్ దీరేంద్ర సింగ్ తన అనుచరులను వెంటబెట్టుకొని వెంటనే కడల్పూర్ గ్రామానికి వెళ్లి స్థానిక ముస్లిములను కలిసి వివరాలను సేకరించి పీసీసీకి, కాంగ్రెస్ (27వ తేదీన) అధిష్టానానికి చేరవేసాడు.

 

ఆ మరునాడు ఆ గ్రామంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించేందుకు లక్నోమరియు డిల్లీ నుండి కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు వస్తున్నట్లు తెలుసుకొన్నసమాజ్ వాదీ ప్రభుత్వం, వారు దీనిని రాజకీయం చేసి తన ముస్లిం వోటు బ్యాంకును గండి కొట్టేందుకు వస్తున్నారని గ్రహించిన వెంటనే, ఇదంతా తన మెడకు చుట్టుకోకూడదనే ఆలోచనతో, సంబందిత ప్రభుత్వాదికారులను పరగులు తీయించి 27వ తేదీ అర్ధరాత్రిపూట డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కార్యాలయం తెరిచి, అక్కడి నుండి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు స్థానిక మాజిస్ట్రేట్ కు ఫాక్స్ మెసేజ్ పంపారు.

 

కానీ, ఆ మరునాడు కాంగ్రెస్ నేతలెవరూ అక్కడికి రాకపోవడంతో అఖిలేష్ ప్రభుత్వం తాము తొందరపడి దుర్గాను సస్పెండ్ చేసినట్లు గ్రహించింది.

 

ఈ విషయమంతా మీడియాకి పొక్కడంతో, ఇక ప్రభుత్వం కూడా తన తప్పును సమర్దించుకోక తప్పలేదు. ఒకవైపు మీడియా అఖిలేష్ ప్రభుత్వ తీరును ఎండగడుతుంటే, మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అకిలేష్ యాదవ్ ఆ విమర్శలకు ధీటుగా స్పందించినప్పటికీ, ఈ వ్యవహారం మరింత ముదిరితే ప్రమాదమని భావించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దుర్గా నాగ్ పాల్ తో రాజీయత్నాలు మొదలుపెట్టింది.

 

మశీదు గోడ కూల్చేందుకు తానే ఆదేశాలు జారీ చేసానని అంగీకరిస్తూ క్షమాపణ పత్రం వ్రాసి ఇచ్చినట్లయితే, సస్పెన్షన్ ఆర్డర్స్ వెనక్కు తీసుకొంటామని ఆమెకు కబురు పంపింది. అయితే, ఏ తప్పు చేయని తాను క్షమాపణ కోరే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పడంతో ప్రభుత్వం కంగు తింది. ప్రస్తుతం ఈ కధ సుప్రీం కోర్టుకి చేరుకోంది. ఈ నెల 22న సుప్రీం కోర్టు ఈ కేసు విచారణ చేపట్టబోతోంది.

 

ఈ కధలో కొసమెరుపు ఏమిటంటే, ఆమెను అవినీతిపై పోరాడే దుర్గామాతగా మీడియా వర్ణించడం జీర్ణించుకోలేని రాష్ట్రమంత్రి అజాం ఖాన్, ఆమె పేరులో కేవలం దుర్గా అనే పేరు ఉన్నందునే మీడియా ఆమెకు అంత అనవసరమయిన ప్రాదాన్యం ఇస్తోందని, లేకుంటే అసలు ఆమెను పట్టించుకొనే వారే ఉండరని అన్నారు.