దుబ్బాకలో కేంద్ర బలగాలు!  బైపోల్ పై ఢిల్లీ నిఘా 

తెలంగాణ రాజకీయలను షేక్ చేస్తున్న దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాక, సిద్దిపేటలో జరిగిన, జరుగుతున్న పరిణామాలపై కేంద్రం  సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. లోకల్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు రావడం, బీజేపీ హైకమాండ్ కూడా ఫోకస్ చేయడంతో 
దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర బలగాలను పంపించింది. ఉప ఎన్నిక కోసం వచ్చిన కేంద్ర బలగాలు దుబ్బాక నియోజకవర్గ వీధుల్లో  ఇప్పుడు కవాతు చేస్తున్నాయి. ఉప ఎన్నికను పర్యవేక్షించేందుకు  ప్రత్యేక పరిశీలకుడిని కూడా నియమించింది సీఈసీ. 


ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం కేంద్ర బలగాలను మోహరించాల్సి వచ్చిందంటే దుబ్బాకలో పరిస్థితి ఏ రెేంజ్ లో ఉందో ఊహించవచ్చు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో , తెలంగాణలో కూడా చాలా ఉప ఎన్నికలు జరిగాయి. కాని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలను సవాల్ గా తీసుకోవడం, ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో రోజు రోజుకు నియోజకవర్గంలో సమీకరణలు మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం అధికార పార్టీని కలవరపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో ఓడితే పరువు పోతుందన్న భయంతో టీఆర్ఎస్ పార్టీ దుబ్బాకలో అక్రమాలకు పాల్పడుతుందని విపక్షాలు చేస్తున్న ఆందోళనలు నియోజకవర్గంలో కాక రేపుతున్నాయి. 

దుబ్బాక ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. తమ పార్టీ నేతలపై పోలీసులతో నిఘా పెట్టించిందని, భయబ్రాంతులకు గురి చేస్తోందని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావు బంధువుల ఇండ్లలో పోలీసులు సోదాలు చేయడం తీవ్ర దుమారం రేపింది. మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లో పోలీసులే  రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు పెట్టారని బీజేపీ ఆరోపించగా.. ఆ ఇంట్లోనే డబ్బులు దొరికాయంటూ సిద్ధిపేట సీపీ వీడియో ఫూటేజీని విడుదల చేశారు. ఇక సిద్ధిపేట సోదాల ఘటనపై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించింది. సిద్ధిపేటకు వస్తున్న పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది. తనపై సిద్ధిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపించిన సంజయ్.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ ఏకంగా దీక్షకే దిగారు. 

బీజేపీ అభ్యర్ది రఘునందన్ రావు మామ, బంధువుల ఇంటిపై పోలీసుల సోదాలు, బంజి సంజయ్ పై పోలీసుల దురుసు ప్రవర్తనను బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందని తెలుస్తోంది.
దుబ్బాక లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని సమాచారం. 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దుబ్బాక పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కు ఫోన్ చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది

సిద్ధిపేట, దుబ్బాక ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పారు. స్థానిక పోలీస్ అధికారులపై తమకు నమ్మకం లేదన్నారు.  సిద్ధిపేట్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, కేంద్ర బలగాలతో మాత్రమే దుబ్బాక ఉప ఎన్నికలు జరపాలని కోరారు. బీజేపీ నాయకులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తోన్న విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్ళారు కమలం నేతలు.  దుబ్బాకకు  ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని బీజేపీ ఈసీకి విన్నవించింది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఫిర్యాదుల మీద  ఫిర్యాదులు, బీజేపీ పెద్దల జోక్యంతోనే  సరోజ్‌ కుమార్‌ ఠాకూర్‌ను ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించినట్లు తెలుస్తోంది. 


తమిళనాడు కేడర్‌కు చెందిన సరోజ్‌ కుమార్‌.. ప్రస్తుతం చెన్నై సైబర్‌క్రైం విభాగ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది పశ్చిమబెంగాల్‌ ఉప ఎన్నికల పరిశీలకుడిగా పనిచేసిన సరోజ్‌కుమార్‌.. సమర్థంగా ఎన్నికలను నిర్వహించినందుకుగాను అవార్డు కూడా తీసుకున్నారు. ఉప ఎన్నికకు శాంతి భద్రతల పరిశీలకుడిగా సరోజ్‌ కుమార్‌ ఠాగూర్‌ను నియమించడాన్ని  బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్‌ కుమార్‌ స్వాగతించారు. ఉప ఎన్నికలో గెలుపు కోసం లోకల్ పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న కారు పార్టీ ఆగడాలు ఇకపై సాగవన్నారు సంజయ్. ఎన్నికల నిర్వహణలో సమర్థుడిగా పేరున్న సరోజ్ కుమార్ నియామకంలో దుబ్బాకలో అధికార పార్టీ అక్రమాలకు చెక్ పడుతుందని కమలం నేతలు చెబుతున్నారు. 

దుబ్బాక ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో  గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలింగ్ రోజున ఉద్రిక్తతలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో సమస్యాత్మక గ్రామాల్లో మరిన్ని బలగాలను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. మొత్తంగా  ఉపఎన్నిక పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించడం,  కేంద్ర బలగాలను దించడంతో  దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కిస్తున్న దుబ్బాకలో ఏం జరగబోతుందన్న దానిపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.