మందుతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా!

 

వీకెండ్ వచ్చిందంటే చాలు... బార్లన్నీ కిటకిటలాడిపోతుంటాయి. లోటాల కొద్దీ మద్యాన్ని జుర్రుకునేందుకు మందుబాబులు సిద్ధపడిపోతుంటారు. అంతవరకూ సరే! ఓ రెండు పెగ్గులు లోపలకి వెళ్లిన తర్వాత వీళ్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తూచా తప్పకుండా నెమరేసుకోవడం చూస్తుంటాం. ‘సుందరం మాస్టార్!’ అంటూ పక్కవాళ్లని చితకబాదేయడమూ చూస్తుంటాం. దీనికి కారణం ఏమిటంటారు!

 

ఇంగ్లండులోని ఎక్సెటర్ విశ్వవిద్యాలంలోని పరిశోధకులు... మద్యపానానికీ, జ్ఞాపకశక్తికీ మధ్య ఉన్న సంబంధాన్ని పరీక్షించాలని అనుకున్నారు. ఇందుకోసం వారు మద్యం అలవాటు ఉన్న ఓ 88 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ కొన్ని కొత్త పదాలను నేర్పించారు. ఇలా కొత్త పదాలు నేర్చుకున్న తర్వాత, వారిని రెండు బృందాలుగా విభజించారు. వీరిలో కొందరు, తగిన మోతాదులో మద్యం తాగవచ్చని చెప్పారు. మరికొందరు మద్యానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.

 

రెండోరోజు కూడా ఇదే తరహాలో ప్రయోగం జరిగింది. కొత్త పదాలను నేర్పించడం. అలా నేర్చుకున్న తర్వాత కొందరు మద్యం తాగేందుకు అనుమతించడం. ఇలా రెండు రోజుల తర్వాత... వారిలో ఎంతమంది కొత్త పదాలను, ఎంత నైపుణ్యంతో నేర్చుకున్నారో పరిశీలించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా మద్యానికి దూరంగా ఉన్నవారికంటే, మద్యం పుచ్చుకున్నవారే ఎక్కువ పదాలను గుర్తుచేసుకున్నారట.

 

వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు! కానీ దీని వెనుక శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మద్యం తాగేటప్పుడు మన మెదడు పనిచేసే తీరు మారిపోతుంది. ఆ సమయంలో ఎలాంటి సమాచారమూ తలకి ఎక్కదు. దాంతో అంతకుముందు నేర్చుకున్న సమాచారాన్నే మరింత పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు! మెదుడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోకేంపస్ కూడా తన దృష్టిని దీర్ఘకాలిక జ్ఞాపకాల మీద కేంద్రీకరిస్తుంది. అలాగని జ్ఞాపకశక్తిని తిరగీతోడేందుకు మద్యం జోలికి పోదామనుకునేవారు... మందుతో పాటుగా వచ్చే అనారోగ్యాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పైగా మద్యం మోతాదు దాటితే, అసలు మెదడే పూర్తిగా మొద్దుబారి అసలుకే ఎసరు తప్పదు మరి!

- నిర్జర.