పేస్ట్ లో బంగారం ఉందా..?

మీ పేస్ట్ లో ఉప్పు ఉందా? అనే యాడ్ చూసి స్ఫూర్తి పొందారో ఏంటో.. కొందరు స్మగ్లర్స్ మా పేస్ట్ లో బంగారం ఉంది అంటున్నారు.. స్మగ్లర్స్ దొరికిన ప్రతిసారీ వీళ్ళ తెలివితేటలు ఏంట్రా బాబు అని అవాక్కవుతాం.. ఈ తెలివి తేటలేదో సక్రమంగా ఉపయోగించి బాగుపడొచ్చుగా అని తలపట్టుకుంటాం.. తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది.

 

 

డీఆర్‌ఐ వర్గాల కథనం ప్రకారం, కొలంబో కేంద్రం గా కొందరు స్మగ్లర్లు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు బంగారం తరలిస్తున్నారని సమాచారం అంది.. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మదురై మీదుగా శంషాబాద్‌కు వచ్చిన విమానంలోంచి దిగి ఎయిర్‌పోర్టు వెలుపలికి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెట్టారు.. ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని సోదా చేశారు.. అతని వద్ద పేస్టు రూపంలో ఉన్న కెమికల్‌ మిశ్రమంలో పొడిగా చేసి ఉన్నబంగారాన్ని కనుగొన్నారు..అయితే 1,800 గ్రాములు బరువున్న ఆ పేస్ట్ ని కరిగించగా.. 1,120 గ్రాముల బంగారం వచ్చినట్టు తెలుస్తోంది.. మొత్తానికి స్మగ్లర్ ఎంత తెలివిగా వచ్చాడో, అధికారులు అంతే తెలివిగా అరెస్టు చేశారు.