పోలింగ్ కు ముందు ఫెస్టివల్! దుబ్బాక ఓటర్లకు డబుల్ ధమాకా

ఉప ఎన్నికలు వచ్చాయంటనే ఓటర్లకు డిమాండ్. ఉప ఎన్నికలో పోటీ తీవ్రంగా ఉంటే ఓటర్లకు పండుగే. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక జరగనున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఓటర్లకు మాత్రం డబుల్ ఫెస్టివల్ వచ్చినట్లైంది. తెలంగాణలో అతి పెద్ద పండుగ దసరా. ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు విజయ దశమి రావడంతో దుబ్బాక  ఓటర్లకు డబుల్ ధమాకా తగిలినట్లైంది. ఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్ల ప్రసన్నం కోసం నానా పాట్లు పడుతున్నాయి. భారీగా డబ్బులు వెదజల్లుతున్నారు నేతలు. ఇప్పుడు దసరాను ఓట్ల వేటలో పార్టీలు ఉపయోగించుకుంటున్నాయని తెలుస్తోంది. పండగ పూట ప్రజలకు భారీగా నజనారాలు, తాయిలాలు ఇస్తున్నారట. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో దసరా జోష్ రెట్టింపైందని చెబుతున్నారు. 

 

దుబ్బాక నియోజకవర్గంలోని ఓటర్ల కోసం పండగ ఆఫర్లు ప్రకటిస్తున్నాయట ప్రధాన పార్టీలు. మందు, మటన్ ఇంటింటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. ఇందుకోసం భారీగా మేకలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యూహం ప్రకారం పార్టీలు  ముందుకెళ్తున్నాయని చెబుతున్నారు. మందు, మటన్ పంపిణి కోసం ప్రతి 100 ఇండ్లకు ఒక ఇన్​చార్జిని పెట్టారట. గ్రామాలు, వార్డులు, కులాలు, మహిళా గ్రూపులు, రైతులు, యువజన సంఘాలు.. ఇలా ఎలా సాధ్యమైతే అలా మటన్ పంపిణి చేసేలా ఏర్పాట్లు చేసుకున్నారని చెబుతున్నారు. పండుగ రోజు ప్రతి ఇంటికి లిక్కర్ ను సరఫరా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. మద్యం పంపకాల్లో క్యాండిడేట్లు కొత్త పోకడ పోతున్నారట. గ్రూపులు పెట్టి, స్పెషల్​టోకెన్లు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది.

 

దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ప్రలోభాలు జోరుగా నడుస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు క్యాండిడేట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త కొత్త ఆఫర్లతో ఓటర్లపై వల విసురుతున్నారు. సన్న బియ్యం బస్తాలు, నూనే డబ్బాలు, గోదుమ పిండిలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారట. ఇంటింటికీ కేజీ బాస్మతి బియ్యం ప్యాకెట్లను కొన్ని గ్రామాల్లో ఇచ్చారని చెబుతున్నారు. వెజిటేరియన్స్​ కోసం స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటిల్లిపాదికి కొత్త బట్టలను కూడా సరఫరా చేసినట్లు చెబుతున్నారు. యువకులకైతే ఏది అడిగితే అది ఇచ్చేందుకు పార్టీల నేతలు ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.

 

మంది, మటన్ పంపిణిలోనూ పార్టీలు పోటి పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ వారు ఇచ్చిన దాని కంటే ఎక్కువే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్టీలు పోటీ పడి ఇస్తున్న తాయిలాలతో ఖుషీగా ఉన్నారు దుబ్బాక ఓటర్లు. ఉప ఎన్నిక సమయంలో దసరా రావడంతో ఈసారి జబర్దస్తుగా జరుపుకుంటామని చెబుతున్నారు. మొత్తంగా దుబ్బాకలో ఈసారి దసరా డబుల్ జోష్ తో జరుగుతుందని తెలుస్తోంది.