భయం ఎందుకు.. పదండి ముందుకు...

 

ఓ చిన్న కథ చెప్పుకుందామా? అనగనగా అది ఒక ఊరు. ఆ ఊరు నుంచి పట్టణ ప్రాంతానికి వెళ్ళాలంటే ఓ కొండ దిగి అడవి దాటి వెళ్ళాలి. ప్రతీరోజు చాలామంది వ్యాపార పనుల మీద గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళిరావాల్సి వుంటుంది. ఒకరోజు కొంతమంది గ్రామస్థులు అలా ఆ కొండ దిగి అడవి దారి వెంబడి వెళుతుంటే ఎక్కడనుంచో గంట ఆగకుండా మోగుతూనే వుంది. చుట్టూ చూశారు వారి కాళ్ళకి ఏదో తగినట్టు అయ్యి చూస్తే  అక్కడ ఓ వ్యక్తి అస్థిపంజరం పడివుంది. దూరం నుంచి గంట మోత. ఒక్కసారిగా భయపడిపోయారు ఆ గ్రామస్థులు. ఒకటే పరుగు. గ్రామం చేరేదాకా ఆగలేదు. ఇలా గ్రామం చేరిన ఆ గ్రామస్థులు మిగతా వారితో వారు చూసినది, విన్నది చెప్పారు.


వారు చెప్పింది విన్న మిగతా గ్రామస్థులు కూడా ఆ శబ్దం ఏమయివుంటుంది... ఎలా వస్తోంది అని తర్జనభర్జన పడ్డారు. రకరకాల ఊహాగానాలు... అది ఏమయివుంటుందా అని. చివరికి ఎవరో అన్నారు అది గంటల రాక్షసి అయ్యివుంటుంది అని. అవునవును అంటూ మరికొందరు వత్తాసు పలికారు. దాంతో అందరూ మరింత భయపడిపోయి  ఇక ఆ రోజు నుంచి ఆ అడవి వెంబడి వెళ్ళటం మానేశారు. కానీ అలా ఎన్నాళ్ళని? గంటల శబ్దం అయితే ఆగటం లేదు. భయంతో గ్రామస్తులందరూ ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్నీ ఊరిపెద్దకి చెప్పారు కూడా. అయితే ఉన్నపళంగా అందరూ ఊరు ఖాళీ చేయటమంటే పొలాలు, ఇళ్ళు, అస్తులు ఏమవ్వాలి? ఏదయినా దారి వెతుకుదాం కొంతకాలం ఓపిక పట్టమన్నాడు గ్రామస్థులని.


అప్పుడు ప్రభావతి అనే గ్రామస్తురాలు ముందుకు వచ్చి నేను ఆ గంటల రాక్షసి సంగతి ఏంటో తెలుసుకుంటాను. అందరూ ఓపిక పట్టండని కొన్ని మామిడి పళ్ళు తీసుకుని అడవిదారి పట్టింది. అయితే గ్రామస్తులంతా హేళన చేశారు. నీవల్ల ఏం అవుతుంది అని. ప్రయత్నించటంలో తప్పులేదు కదా. ఆ రాక్షసి చంపితే నేను ఒక్కర్తినే చనిపోతాను. కానీ అది ఒట్టి భయమే అని తెలిస్తే అందరం బతుకుతాం అని ముందుకు కదిలింది ప్రభావతి. నిజానికి రాక్షసులు ఉండరని ప్రగాఢంగా నమ్మిన ప్రభావతి అసలు సంగతి తెలుసుకోవటానికి అడవి దారి పట్టింది.


అలా అడవి వైపు వెళ్తూ ప్రభావతి ఆలోచించటం మొదలు పెట్టింది. ఆ గంట శబ్దం వినిపించినప్పటి నుంచి నిజానికి ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. అంటే ఆ గంట ఏ జంతువులో మోగిస్తుండాలి. ఆ గంట శబ్దం వస్తున్న చోటికి వెళ్ళి తన వెంట తెచ్చిన మామిడి పళ్ళని వెదజల్లి ఓ చెట్టు చాటున దాక్కుంది. కాసేపటికి ఆ మామిడి పండ్ల వాసనకి ఓ కోతుల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ కోతి చేతిలో గంట వుంది. ఆ కోతి గంట పక్కన పడేసి పళ్ళు తింటుంటే నెమ్మదిగా గంట తీసుకుని గ్రామానికి చేరింది ప్రభావతి. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు ప్రభావతి చెప్పింది విని. ఆ గంట తమ ఊరి చివర దేవాలయంలోనిదని గుర్తించారు.


ఆ దేవాలయంలో గంట దొంగిలించిన దొంగ అడవి గుండా పారిపోతుండగా పులి అతన్ని చంపి తినింది. ఆ గంట కోతులకి దొరికింది. తమాషా శబ్దం రావటంతో కోతులు ఆ గంటతో ఆడుతున్నాయి. గంటల రాక్షసి లేదు అని తెలుసుకున్న గ్రామస్థులు హాయిగా ఊపిరి తీసుకున్నారు. ప్రభావతిని మెచ్చుకున్నారు.


ఒకోసారి మనం కూడా ఏవో కొన్ని భయాలతో అడుగు ముందుకు వేయటానికి సందేహిస్తాం. అయితే ఆ ఒక్క అడుగు వేయగలిగితే చాలు ఇక అడుగుల వడి ఆగదని తెల్సినా ఆ ఒక్క అడుగే వెయ్యలేకపోతాం. కానీ చిన్న లాజిక్ ఆలోచిస్తే చాలు భయాలని ఈజీగా వదిలించుకోవచ్చు.


-రమ ఇరగవరపు