గాడిదలపై ఈవీఎంల తరలింపు

 

ఎన్నికల సిబ్బంది గాడిదలపై ఈవీఎంలను తరలించారు. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. ఎత్తైన ప్రదేశాలు, ఆధునిక రవాణా సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లడానికి ఎన్నికల సిబ్బంది జంతు రవాణాపై ఆధారపడుతున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఈవీఎంలు సహా ఎన్నికల పరికరాలను తీసుకెళ్లడానికి గాడిదల్ని ఉపయోగించారు. కొండ ప్రాంతాల్లో దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సామాగ్రిని ఇలా గాడిదలపై తరలించారు.

రాష్ట్రంలోని ధర్మపురి, డిండిగుల్, ఈరోడ్, నమక్కల్, థేని వంటి జిల్లాల్లోని పోలింగ్ బూతులకు ఆధునిక రవాణా సౌకర్యం లేదు. అక్కడి చేరుకోవాలంటే కాలినడకన వెళ్లాల్సిందే. అయితే ఎన్నికల సామాగ్రిని అంత దూరం మోసుకొని పోలేక, సిబ్బంది గాడిదలపై రవాణా చేశారు. ఈవీఎంలను మూటకట్టి గాడిదలపై తీసుకెళ్లారు. ఎన్నికల సామాగ్రినే కాకుండా తమ సామాగ్రిని కూడా గాడిదల మీదనే రవాణా చేశారు. ముందుకు గాడిదలు వెళ్తుంటే వెనకాల ఎన్నికల సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వెళ్లారు.