ఆయన వైట్ హౌజ్లోకి... వాళ్లు రోడ్ల మీదకి! 


డొనాల్డ్ ట్రంప్... ఒకప్పుడు ఈ పేరు కామెడీ! కాని, తరువాత క్రమంగా సీరియస్ గా తీసుకున్నారు జనం! కొందరు వ్యతిరేకిస్తే , అంతకు మించి సమర్థించిన వారు వున్నారు. దాని ఫలితమే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవటం. హిల్లరీని కాదని ఈ అల్లరినే ఎంచుకున్నారు అమెరికన్స్. కాని, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రెసిడెంట్ ట్రంప్ అనే సత్యాన్ని ఇంకా ఆయన వ్యతిరేక వర్గం జీర్ణించుకున్నట్టు కనిపించటం లేదు. అందుకే, అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తోంది. అత్యుత్సాహంతో కొంపలు మునిగేలా వున్నాయి... 


అమెరికా అంటే స్వేఛ్ఛా. అమెరికా అంటే ప్రజాస్వామ్యం. అమెరికా అంటే సమానత్వం. అక్కడున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా అందరూ భావించేది ఇదే. ఆ మాట నిజమేనన్నట్టు కొనసాగుతున్నాయి యాంటీ ట్రంప్ ర్యాలీలు. సాక్షాత్తూ దేశాధ్యక్షుడికే వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి వస్తున్నారు. వాళ్లకి మీడియా కూడా వంత పాడుతోంది. మొత్తంగా ట్రంప్ పాలన అంత ఆషామాషీగా సాగనవ్విమని ఆందోళనకారులు సిగ్నల్స్ ఇస్తున్నారు! 


ట్రంప్ ఎన్నికయ్యాక ఇంకా పెద్ద వివాదాస్పద నిర్ణయాలేం తీసుకోలేదు. ఆయన్ని దోషిగా చూపించేందుకు నిరసనకారుల వద్ద బలమైన కారణాలు కూడా లేవు. అయినా కూడా మీడియా, ఉద్యమకారులు అపొహల ఆధారంగానే రచ్చకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. ఇది ప్రజల చేత న్యాయబద్ధంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడికి నిజంగా అవమానమే. అతను గతంలో చేసిన కామెంట్స్,ప్రకటనలు ఎలా వున్నా ఇప్పుడు మాత్రం ప్రెసిడెంట్. ఆయన ఏం చేస్తాడో కొన్నాళ్లైనా వేచి చూడాలి. అంతే తప్ప ప్రమాణ స్వీకారోత్సవం నుంచే ప్రతీకారంతో రగిలిపోతే ఖచ్చితంగా అతే అనిపించుకుంటుంది.


మన దగ్గర మోదీ ఎన్నిక తరువాత మీడియా ప్రవర్తించినట్టే అమెరికాలోనూ ప్రవర్తిస్తోంది. ట్రంప్ ప్రమాణానికి కేవలం 2లక్షల మంది వచ్చారంటూ అబద్ధాలు చెబుతోంది అమెరికన్ మీడియా. అంతే కాదు రోజుకో రకం విష ప్రచారం చేస్తోంది. ఇక్కడి అవార్డ్ వాప్సీ గ్యాంగ్ లాగా అమెరికాలోనూ ఒక వర్గం మేధావులు, జర్నలిస్టులు ట్రంప్ కు వ్యతిరేకంగా కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఇదంతా నూతన అధ్యక్షుడికి చిర్రెత్తించే విషయమే. అందుకే, ఆయన  కూడా ప్రతి దాడి మొదలుపెట్టాడు. జర్నలిస్టులంత నీతి లేని వాళ్లు వుండరని తిట్టిపోశాడు. వైట్ హౌజ్ ప్రతినిధులు అయితే తమ కొత్త ప్రెసిడెంట్ తో మీడియా సరిగ్గా నడుచుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామని బెదిరిస్తున్నారు. నిరసనలు అంటూ విధ్వంసానికి దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పదేళ్లు జైలులో వుంచేలా కేసులు పెట్టే ఆలోచనలో వున్నారు! 


డొనాల్డ్ ట్రంప్ దెబ్బ బయటి ప్రపంచానికి ఎలా వుండబోతోందో కాని... అమెరికాలోని అంతర్గత శత్రువులకి మాత్రం గట్టిగానే పడేలా కనిపిస్తోంది. నాలుగేళ్ల సంఘర్షణకి తెర లేచినట్టే అనిపిస్తోంది!