100 రోజుల ట్రంప్… ఇండియన్స్ కి కష్టం! అమెరికాకు నష్టం!

రానే రాడనుకున్న ట్రంప్ వచ్చేశాడు! అప్పుడే వైట్ హౌజ్ లో వంద రోజులు కూడా పూర్తి చేసుకున్నాడు! అయితే, అందరూ ముందూ నుంచీ భయపడ్డట్టుగానే ఈ వంద రోజుల్లో మంచి హాలీవుడ్ యాక్షన్ మూవీ లాంటి సినిమా చూపించాడు ప్రపంచానికి! మరీ ముఖ్యంగా, మన ఇండియన్స్ కి! అందుకు, తాజా ఉదాహరణ … భారతీ ఎయిర్ టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలే!

 

ట్రంప్ అమెరికాలోకి ఇండియన్స్ ఎడాపెడా వచ్చేయకుండా ఆంక్షలు విధించాడు. సాఫ్ట్ వేర్ నిపుణులకైతే అమెరికాలోకి ఎంటర్ అవ్వటమే అసాధ్యం చేసేశాడు. కొత్త వారి సంగతి సరే.. పాత వార్ని కూడా అమెరికా వదిలే వెళ్లేలా పొగబెడుతున్నాడు. ఇదంతా భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై దారుణమైన ప్రభావం చూపుతోంది. అందుకే, సునీల్ మిట్టల్ లాంటి టాప్ బిజినెస్ మ్యాన్ కూడా ట్రంప్ మీద మండిపడుతున్నాడు. ఇండియన్ ఎక్స్ పర్ట్స్ యూఎస్ వద్దదైతే… మనకు మాత్రం అమెరికన్ కంపెనీలైన ఫేస్బుక్, గూగుల్ లాంటివి ఎందుకన్నాడాయన! అమెరికన్ ఎఫ్బీ, గూగుల్ లాంటి వాటికి బదులు ఇండియన్ సైట్స్ ని డెవలప్ చేసుకుంటే అమెరికాకు ఎంత లాస్ వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పాడు. చైనా ఆల్రెడీ అదే పని చేస్తోంది  కూడా!

 

ఇండియాకి అమెరికాతో వున్న రాజకీయ సంబంధాల వల్ల ఇప్పటికిప్పుడు కఠినమైన నిర్ణయాలు ఏమీ తీసుకోలేకపోవచ్చు. సునీల్ మిట్టల్ చెప్పినట్టు ఫేస్బుక్, గూగుల్ లాంటివి నిషేధించి మన స్వంత సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, సర్చ్ ఇంజన్లు రెడీ చేసుకోకపోవచ్చు. పాకిస్తాన్, చైనా లాంటి శత్రువుల్ని ఎదుర్కోటానికి అమెరికా మనకు చాలా అవసరం. కాని, ఇక్కడే మరో కోణం కూడా వుంది. భారతీయ నిపుణుల్ని అమాంతం తిప్పి పంపే చర్యలకి ట్రంప్ పూనుకుంటున్నాడు. అలాగే కొత్త వార్ని రానీయకూడదని కూడా గట్టిగానే డిసైడ్ అయ్యాడు. దీని వల్ల కేవలం ఇండియన్స్ కే నష్టమా? అమెరికాకు ఎలాంటి ఢోకా లేదా? నిజంగా అదే పరిస్థితి అయ్యి వుంటే.. ఇంత కాలం మన వార్ని అగ్రరాజ్యం భరించేదే కాదు! ఇదే అతి పెద్ద సంకేతం భారతీయుల సత్తాకి!

 

అమెరికాకి వలసొచ్చే అనేక దేశాల వారు పొట్ట చేతపట్టుకుని వస్తారు. కాని, అందరూ టాలెంటెడ్ అనటానికి వీల్లేదు. కేవలం ఇండియా, సింగపూర్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చే వారే బాగా చదవుకుని, అమెరికన్ వ్యవస్థకు ఉపయోగపడే హైలీ స్కిల్డ్ పీపుల్. మిగతా వారు అమెరికాలో స్థిరపడి చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ వుంటారు. వారు అమెరికాలోకి రాకపోవటం వల్ల పెద్దగా నష్టం వుండదు. ఆ ఉద్యోగాలు అమెరికాలోని స్థానికులు భర్తీ చేయగలరు. కాని, చాలా వరకూ ఇండియన్స్ సేవలందించే సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగాలు ఎవరు చేయాలి? వాటికి తగిన వారు అమెరికాలో వున్నారా? లెక్కల ప్రకారం… ఇండియన్ ఇంజనీర్స్ స్థాయిలో పని చేసే టాలెంట్ పీపుల్ అమెరికాలో లేరు!

 

ఇండియాలో ఇంజనీరింగ్ చదవటం చీప్. అలాగే, మన వారు అమెరికాకి వెళ్లాలన్న కోరికతో, కసితో మరింత బాగా చదివేస్తుంటారు. కాబట్టి ఇండియన్స్ వల్ల ఇంత కాలం అమెరికన్ ఐటీ కంపెనీలు బోలెడు లాభపడ్డాయి. మన వారు చాలా తక్కువ జీతాలకే గంటల కొద్దీ కష్టపడ్డారు. కాని, ఇప్పుడు ఇండియన్స్ ని ట్రంప్ బ్యాన్ చేస్తే అమెరికన్స్ వాట్ని భర్తీ చేయాలి. ఇండియన్స్ అంత టాలెంట్ అమెరికన్స్ లో లేదనే విషయం పక్కన పెట్టినా… వారు డిమాండ్ చేసేటంత సాలరీ కంపెనీలు ఇచ్చుకోలేవు. దీర్ఘ కాలంలో ఇదే అమెరికా వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం వుంది!

 

ఖరీదైన ఉద్యోగుల్ని భరిస్తూ మల్టీ నేషనల్ కంపెనీలు అమెరికాలోనే ఎందుకుండాలి? ఇంతకాలం ఇండియన్స్ అమెరికాకు వలసొచ్చారు. ఇప్పుడు అమెరికన్ కంపెనీలే ఇండియా లాంటి దేశాలకు వచ్చేస్తే? తక్కువ జీతాలకు పని చేసే టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ వాటికి హాయిగా దొరుకుతుంది! ట్రంప్ ఆంక్షలు, బెదిరింపుల బాధ కూడా తప్పుతుంది! ఇలాంటి పరిణామం ఖచ్చితంగా జరుతుందని ఇప్పుడే చెప్పలేకున్నా… జరగదని మాత్రం అనుకోటానికి వీల్లేదు. అమెరికా నుంచి అమెరికన్ కంపెనీలు తరలిపోవటం మొదలైతే అది అగ్రరాజ్యం అసలుకే ఎసరు తెస్తుంది. ఇది ట్రంప్ ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది! లేదంటే, ట్రంప్ ఏలుతోన్న ఈ నాలుగేళ్ల కాలం అమెరికన్ చరిత్రలో తిరిగి వెనక్కి వెళ్లలేని ప్రమాదకర మలుపుగా మిగిలిపోవచ్చు! అమెరికా ఆర్దిక ఆధిపత్యానికి ఇక నుంచీ జీజాలు పడి ముందు ముందు అవ్వి ఫలితాలు చూపవచ్చు! ఎందుకంటే, ప్రపంచంలో ప్రస్తుతం పైపైకి ఎదుగుతున్న ఆర్దిక వ్యవస్థలు కేవలం ఇండియా, చైనాలు మాత్రమే. యూరోపీయన్, అమెరికన్ ఆర్దిక వ్యవస్థలు ఎప్పుడో దూకుడు మానేశాయి! ట్రంప్ చేష్టలు అలాంటి డల్ అమెరికన్ ఎకానమీని మరింత ఢమాల్ గా మార్చే ప్రమాదం పొంచి వుంది!