మంత్రి పదవి దక్కేది ఎవరికి?.. రేసులో విడదల రజనీ, డొక్కా!!

గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపికైన నేపధ్యంలో ఆయన త్వరలో మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో, ఆయన స్థానంలో మంత్రి పదవి ఎవరికి దక్కబోతుంది అనే విషయంపై రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో తనకే మంత్రి పదవి లభిస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ హడావిడిచేస్తున్నారట. ఎమ్మెల్యే రజనీ బీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఆమె భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటంతో.. అటు బీసీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇచ్చినట్టుంది. ఇటు కాపు వర్గాన్ని కూడా సంతృప్తి పరిచినట్టు ఉంటుందని ఆమె అనుచరులు చెబుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డి ద్వారా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్టు తెచ్చుకుని విజయం సాధించిన రజనీ ఆయన ద్వారానే మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. మరి, ప్రస్తుతం పార్టీలో విజయసాయిరెడ్డి పొజిషన్ మునుపటిలా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మంత్రి పదవి పొందాలని ఎమ్మెల్యే రజనీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కుతుందా లేదా అనే విషయంపై వైసీపీ పెద్దలు ఎలాంటి అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం లేదు. ఇక, అదే సామాజికవర్గానికి చెందిన శాసనమండలి చీఫ్‍ విప్‍ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఒకవేళ తనకు మంత్రి పదవిని దక్కకపోయినా.. తన అల్లుడు కిలారి రోశయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉమారెడ్డి కోరవచ్చునని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు, కాసు మహేష్‍రెడ్డికి మంత్రి పదవి దక్కటం ఖాయమని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అయితే, రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనే విషయం బయట పడటం లేదు. ఇప్పటికే పార్టీకి రెడ్డి సామాజికవర్గం ముద్ర పడుతున్న నేపథ్యంలో.. మళ్లీ అదే సామాజికవర్గానికి మంత్రి పదవి కట్టబెడితే మిగతా వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, కమ్మ సామాజికవర్గానికైతే మంత్రి పదవి దక్కే అవకాశాలు లేనే లేవని అంటున్నారు. 

ఇదిలా ఉంటే, ఇటీవల ఎమ్మెల్సీగా గెలిచిన సీనియర్‌ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కు మంత్రి పదవి ల‌భించబోతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గాల్లో సీనియర్‌ నేతగా, మంత్రిగా పనిచేసిన డొక్కాను సీఎం జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని అంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన డొక్కా అనుభవం తనకు పనికి వస్తుందని, రాజ‌కీయంగా కూడా ఇది క‌ల‌సి వ‌స్తుంద‌నే అంచ‌నాల‌తో మాదిగ వర్గానికి చెందిన సీనియర్‌ నేత డొక్కాకు మంత్రివర్గంలో స్థానం కల్పించ‌బోతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. దీంతో మాదిగ ల‌ను పూర్తిగా ఆకట్టుకోవచ్చనే ఆలోచనలో సీఎం ఉన్నారు అంటున్నారు.

మొత్తానికి, మోపిదేవి రాజ్యసభ ఎంపికతో ఖాళీ అవుతున్న మంత్రి పదవికి భారీగానే పోటీ ఉంది. మరి సీఎం జగన్ వారిలో ఎవరికి అవకాశమిస్తారో?. అసలు, గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఇవ్వకపోతే నష్టం ఏమిటి అని సీఎం భావిస్తే.. ఈ జిల్లా ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కకపోవచ్చు. అప్పుడు మరింతమంది ఇతర జిల్లాల నేతలు రేసులోకి రావొచ్చు. ఒక వేళ మంత్రి పదవి గుంటూరు జిల్లాకి చెందిన వారికే ఇవ్వాలనుకుంటే.. మరి రాజకీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటారో?.. లేదా కులాలను పరిగణనలోకి తీసుకుంటారో?.. చూడాలి.