కుక్క బతుకు

ఆయన ఒక పశువుల వైద్యుడు. ఆ వైద్యుడికి ఒక రోజు తమ ఇంటికి రమ్మంటూ ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఇంట్లో ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో ఉందట. సరే! వైద్యుడు దానిని ఎలాగైనా నయం చేసే అవకాశం ఉందేమో చూసేందుకు సదరు ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి పెరట్లోకి అడుగుపెట్టిన వైద్యుడికి ఓ మూలగా కూర్చుని ఉన్న కుక్కని చూడగానే అర్థమైపోయింది. దానికి వయసు మీదపడిపోయిందనీ, తన అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం లేదనీ!

 

కుక్క చుట్టూ ఆ ఇంటి యాజమానీ, అతని భార్యా, వారి పన్నెండేళ్ల కొడుకూ దీనంగా నిల్చొని కనిపించారు. ‘‘మీకు ఈ మాట వినడం కష్టంగా ఉంటుందని తెలుసు! కానీ వాస్తవం చెప్పక తప్పదు. ఈ కుక్క ఊపిరితిత్తులు క్షీణించిపోయాయి. అది మరెంతో కాలం బతకదు. కానీ దాన్ని కనుక ఇలాగే వదిలేస్తే అది అనుక్షణం నరకయాతన పడాల్సి ఉంటుంది. మీకు సమ్మతం అయితే కనుక అది ఇంక ఎలాంటి బాధా పడకుండా వెంటనే చనిపోయేందుకు ఒక ఇంజక్షను ఇస్తాను,’’ అని చెప్పాడు వైద్యుడు.

 

వైద్యుడి మాటలు వినగానే వారి మొహాలు పాలిపోయాయి. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచీ ఆ కుక్క వారి కుటుంబంలో భాగంగా మారిపోయింది. అది లేకుండా వారికి పూటైనా గడిచేది కాదు. పొద్దు పోయేదీ కాదు! అలాంటి కుక్కని తమ చేతులతో తాము చంపాల్సి రావడం వారి గుండెని పిండేసింది. కానీ అది బాధతో చనిపోయేకంటే అనాయాసంగా చనిపోవడమే మేలనిపించింది. దాంతో మనసుని రాయి చేసుకుని ‘మీ ఇష్టం! మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి!’ అన్నాడు కుటుంబ యజమాని.

 

వైద్యుడు నిదానంగా తన బ్యాగ్‌లోంచి ఒక ఇంజక్షను తీసుకుని ఆ కుక్కకు ఇచ్చాడు. మరుక్షణమే అది మూలుగుతూ తన ప్రాణాలను విడిచింది. ఆ దృశ్యంతో కుటుంబసభ్యులలో ఉన్నా కాస్త నెత్తురూ పాలిపోయింది. వారి తలలు వాలిపోయాయి. కుక్క పట్ల వాటి యజమానులు చూపించే అభిమానం వైద్యుడికి కొత్తేమీ కాదు. అందుకనే వారిని కాస్త ఓదార్చేందుకు- ‘‘కుక్కలు కూడా మనలాగే నిండు నూరేళ్లు బతికితే బాగుండు కదా! కానీ పాపం అవి ఎందుకో పది పదిహేను ఏళ్లకు మించి బతకవు,’’ అన్నాడు. వైద్యుని మాటలకు యజమాని కొడుకు చివ్వున తలెత్తి చూశాడు. ‘‘కుక్కలు అంత తొందరగా ఎందుకు చనిపోతాయో నాకు తెలిసిపోయింది!’’ అన్నాడు.

 

కుర్రవాడు ఏం చెబుతాడా అని అంతా ఆసక్తిగా చూశారు. అతను తన కుర్రతనానికి తగిన సమాధానం ఇస్తాడులే అన్నట్లుగా అతని వంక చులకనగా చూశాడు వైద్యుడు. కానీ అతను చెప్పిన సమాధానానికి వారి దిమ్మ తిరిగిపోయింది.
‘‘మనిషి తన తోటివారిని ప్రేమించేందుకు, ప్రతి రోజునీ కొత్తగా స్వీకరించేందుకు, ప్రతిక్షణం సంతోషంగా జీవించే నేర్పు సాధించేందుకు... చాలా కాలం పడుతుంది. కానీ కుక్కకి ఆ నేర్పు పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఆ నేర్పుతోనే అది బతికే కొద్దికాలం హాయిగా బతికేస్తుంది. ఇక దానికి నూరేళ్లు జీవించాల్సిన అవసరం ఏముంది!’’ అన్నాడు కొడుకు తలవంచుకునే. అందరూ కుక్క బతుకంటే హీనమైనదంటారు. కానీ అసూయాద్వేషాలతో నిండు నూరేళ్లు రగిలిపోయేవారికన్నా కుక్క బతుకు ఎంత నయమో కదా!

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.