డాక్టర్ని నమ్మితే చాలు... నొప్పి తగ్గిపోతుంది

హాస్పిటల్‌కి వెళ్లాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది? అందులోనూ ఏదన్నా నొప్పితో బాధపడుతున్నా, చిన్నపాటి సర్జరీ చేయించుకోవాలన్నా... డాక్టరుగారి నైపుణ్యం ఎలా ఉంటుందో అన్న అనుమానం మనసుని పీకుతూనే ఉంటుంది. కానీ డాక్టరుగారిది మన ఊరే అని తెలిస్తే, లేదా ఆయన హస్తవాసి బ్రహ్మాండం అన్న నమ్మకం కలిగితే! మన నొప్పి తగ్గిపోతుందా?

 

డాక్టరుకీ, రోగికీ మధ్య ఉండే అనుబంధం చికిత్స మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఈ విషయంలో ప్రయోగాలు చేసేందుకు కొంతమందిని ఎన్నుకొన్నారు. వీళ్లందరినీ ఒక ఫారం నింపమన్నారు. వీటి ద్వారా అభ్యర్థుల మతం, నమ్మకాలు, రాజకీయాల పట్ల అభిప్రాయాలు... అన్నిటినీ తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగా వారిని రెండు గ్రూపులుగా విభజించారు.

 

మొదటి గ్రూపులోని వ్యక్తికి అదే గ్రూపులో వైద్యుడి చేత చికిత్స చేయించారు. చికిత్సలో భాగంగా మోచేతి మీద కాస్త వేడి కలిగించారు. కాసేపటి తర్వాత వేరే గ్రూపులో వైద్యుడి చేత ఇదే తరహా చికిత్సని అందించారు. పరిశోధకులు ఊహించినట్లుగానే... రోగి తన గ్రూపులో వ్యక్తి నుంచి చికిత్సని తీసుకున్నప్పుడు, నొప్పి చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించింది. అదే వేరే గ్రూపులోని వ్యక్తి వైద్యుడిగా మారినప్పుడు... నొప్పి ఎక్కువగా తోచింది.

 

ఇంతకీ నమ్మకానికీ నొప్పికీ మధ్య ఇంత సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం సిద్ధంగానే ఉంది. నొప్పి తగ్గించేదుకు ఏదో ప్రయత్నం జరగబోతోందన్న నమ్మకం కలగగానే.. మెదడు కూడా తన వంతుగా నొప్పిని తగ్గించే రసాయనాలను విడుదల చేస్తుందట. అలాంటిప్పుడు ఒక చిన్న పంచదార గుళిక కూడా అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్నే మనం ప్లేసిబో ఎఫెక్ట్‌గా పిలుచుకుంటాము. త్వరగా కంగారుపడే మనుషుల విషయంలో అయితే ఈ ప్లేసిబో ఎఫెక్ట్‌ అద్భుతాలను సృష్టిస్తుంది.

 

అదీ విషయం! డాక్టరుగారి వైద్యం ఎంత ప్రభావమో, ఆయనకి హస్తవాసి ఉందన్న నమ్మకం కూడా అంతే ప్రభావం చూపుతుందన్నమాట.

 

- నిర్జర.