డీయల్ లక్ష్యం పార్టీ మారడమా కిరణ్ పై పగ తీర్చుకోవడమా

 

ఇంత వరకు కేవలం ప్రతిపక్షాలు మాత్రమే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం అవుతుందని చెపుతూ వచ్చారు. అయితే, ప్రతిపక్షపార్టీలు ఆవిధంగా కలలుకంటూ మాట్లాడటం సహజమే గనుక వాటిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇటీవల మంత్రి వర్గం నుండి బర్త్ రఫ్ చేయబడిన డీయల్ రవీంద్ర రెడ్డి కూడా నిన్న కర్నూలు జిల్లా చాగల మర్రి సమీపంలో నిర్వహించిన ఒక బారీ బహిరంగ సభలో అదే మాట అనడం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయటానికి సీఎం కిరణ్ కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. హైకమండ్‌చే నియమించబడి, ఏదో నాలుగు రోజులు పదవిలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకు వచ్చిన కిరణ్ వంటి వ్యక్తులు పార్టీని కాపాడలేరని, అటువంటి వ్యక్తి సీఎం పదవిలో కొనసాగితే పార్టీకే ముప్పు అని అన్నారు. తద్వారా డీయల్ ముఖ్యమంత్రిపై తన పోరాటాన్ని ఉదృతం చేయబోతునట్లు అర్ధం అవుతోంది.

 

అయితే ఇది అంతిమంగా ఆయన పార్టీ నుండి మారేందుకే చేస్తున్నారా?లేక కేవలం తనను మంత్రి పదవి నుండి తప్పించినందుకే ఆక్రోశం వెళ్ళగ్రక్కుతున్నారా? అనే సంగతి కూడా త్వరలోనే తేలిపోతుంది. తను చనిపోయేవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని గట్టిగా చెప్పిన ఆయన, ఇక ముందు కూడా ఆవేశంలో ఇదే తరహాగా (కాంగ్రెస్ భూస్థాపితం వంటి మాటలు) మాట్లాడితే ముఖ్యమంత్రి ఆ మాటలను అధిష్టానం చెవిన వేసి ఆయనను పార్టీ నుండి బయటకి వెళ్లగొట్టవచ్చును. మరి డీయల్ కూడా అలాగే జరగాలని కోరుకొంటున్నారా?అందుకే తన విమర్శలకు పదును పెడుతున్నారా లేక నిజంగా కాంగ్రెస్ లోనే ఉంటూ కిరణ్ కుమార్ రెడ్డిపై పగ తీర్చుకోవలనుకొంటున్నారా? అనే సంగతి కూడా త్వరలో తేలిపోవచ్చును.

 

కడప జిల్లాలో బలమయిన నాయకుడయినా ఆయనను వదులుకోవడానికి ముఖ్యమంత్రికి అభ్యంతరం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఆయనను వదులుకోకపోవచ్చును. బొత్స, దామోదర, రామచంద్రయ్య వంటివారు కూడా అండగా నిలబడి ఆయనను పార్టీ వీడకుండా ఉంచేందుకు గట్టిగా ప్రయత్నించవచ్చును. అదే జరిగితే, కిరణ్ కుమార్ రెడ్డికి అది ఎదురు దెబ్బే. ఆయనకు నిజంగా కిరణ్ పై పగ తీర్చుకోవాలనే ఉద్దేశ్యమే ఉంటే ఆయన కాంగ్రెస్ లోనే ఉండి కిరణ్ వ్యతిరేఖులందరి సహాయ సహకారాలతో ఆయనను ముప్పతిప్పలు పెట్టవచ్చును.

 

ఇక, కడపలో మైసూరా రెడ్డిని కోల్పోయి బలహీనపడిన తెదేపా డీయల్ ను పార్టీలోకి ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తునట్లు సమాచారం. ఆయన వైకాపాలో జేరవచ్చునని ఆయనను వ్యతిరేఖించే కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నపటికీ, జగన్ పొడ గిట్టని ఆయన వైకాపాలో చేరకపోవచ్చును. ఇటువంటి సదవకాశాల కోసమే ఎదురు చూస్తున్న వైకాపా కూడా ఆయనకు గాలం వేస్తునప్పటికీ, ఆయన ఆ పార్టీలో చేరకపోవచ్చును. అందువల్ల డీయల్ రవీంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదా తెదేపాలో చేరడం ఏదో ఒకటి జరుగవచ్చును.