మహిళా సంకల్ప దీక్ష.. తెలంగాణ బీజేపీ చీఫ్ గా డీకే అరుణ!! 

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశముందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి తమదైన శైలిలో వెళుతున్నారు ఆశావహులు. అధ్యక్ష పీఠం ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా రెండు రోజుల పాటు మహిళా సంకల్ప దీక్ష చేపట్టనున్నారు మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ. ఇదే అంశం బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ తో సంబంధం లేకుండా నేరుగా జాతీయ స్థాయి నాయకుల అండదండలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మహిళల పై జరుగుతున్న అనేక దాడులకు మద్యమే కారణమని భావించి తెలంగాణలో మద్యం నిషేధించాలంటూ రెండు రోజుల దీక్ష చేపట్టనున్నారు. 

జాతీయ స్థాయి నేత రాంమాధవ్ ద్వారా బీజేపీలో చేరిన జేజమ్మకు ఆయన ఆశీస్సులు మెండు గానే ఉన్నాయి. దీంతో రాష్ట్ర నాయకులతో సంబంధం లేకుండానే నేరుగా అధిష్టానం ఆదేశాల మేరకు స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు దీక్ష కార్యక్రమం చేపడుతున్నారని బిజెపి పార్టీలో వినిపిస్తున్న మాట. ఒక వైపు లక్ష్మణ్ తనకి మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్నప్పటికీ.. డీకే అరుణ అధిష్టానం లోనూ ఇటు ప్రజల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలుస్తోంది. ఈ నెల 12,13 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద అరుణ దీక్ష చేయనున్నారు. మద్యపాన నిషేధ ఉద్యమం వెనుక అసలు ఎజెండా ఇదేనా అన్నది హాట్ టాపిక్ అయ్యింది. రామ్ మాధవ్ ఆశీస్సులతోనే.. అధ్యక్ష పదవి డీకే అరుణకు రాబోతున్నదా అన్నది బిజెపి వర్గాల్లో చర్చకు దారితీసింది.