కాస్త నన్ను కూడా గుర్తించండి.. పాపం ఏపీ మంత్రికి ఎంత కష్టమొచ్చింది!!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం F2. అందులో ఎమ్మెల్యే పాత్రలో కనిపించిన రఘుబాబు క్యారెక్టర్ భలే సరదాగా ఉంటుంది. నేను ఎమ్మెల్యేని అయ్యా అంటూ ఆయన చెప్పే డైలాగ్ లు నవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఓ మంత్రి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నేను దేవాదాయ శాఖ మంత్రిని అయ్యా, కాస్త నన్ను కూడా గుర్తించండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ గోపూజ మహోత్సవం జరుగుతోన్న సంగతి తెలిసిందే. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా రెండు వేలకు పైగా ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న కార్యక్రమంలో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రినే పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 

 

నరసరావుపేటలో నిర్వహించిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనగా ఆయన వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అయితే, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం ఏదో ద్వితీయ శ్రేణి నేతలాగా ఎక్కడో దూరంగా ఉండిపోయారు. ఇక, టీటీడీ ఈవో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన కూడా మంత్రి లాగే పిలవని పేరంటానికి వచ్చినట్టుగా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది.  టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రిని, టీటీడీ ఈవోనే పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా డిప్యూటీ సీఎం నారాయణస్వామి వంటి వారికి వేదికపై అవమానం జరిగిన ఘటనలు చూశాం. మంత్రికి సముచిత గౌరవం ఇవ్వని ప్రభుత్వ పెద్దల తీరుని అందరూ తప్పుబట్టారు. అయినప్పటికీ జగన్ సర్కార్ తీరు మారకపోవడం గమనార్హం. వైసీపీ పాలనలో మంత్రులకే గౌరవం, గుర్తింపు దక్కట్లేదు.. ఇక మిగతా వారి పరిస్థితి ఏంటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.