ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణం అదే: డైరెక్టర్ తేజ‌

 

ఉద‌య్ కిర‌ణ్.. 2000 లో 'చిత్రం' సినిమాతో వెండితెరకు పరిచయమై.. 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఇలా వరుస హిట్లతో హ్యాట్రిక్ హీరో అయ్యాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో యువత మనసు దోచుకున్నాడు. ఉదయ్ కిరణ్ ని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అల్లుడిని కూడా చేసుకోవాలి అనుకున్నారు. కారణాలేంటో తెలీదు కానీ అది సాధ్యపడలేదు. మెగాస్టార్ ఆయన్ని అల్లుడిని చేసుకోవాలని అనుకున్నారంటేనే.. అర్ధం చేసుకోవచ్చు అప్పట్లో ఉదయ్ కిరణ్ కి ఉన్న క్రేజ్ ఏంటో. అయితే తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హిట్లు కరువయ్యాయి, అవకాశాలు తగ్గిపోయాయి. కెరీర్ బాగా డల్ అయిపోయింది. కారణాలేంటో తెలీదు కానీ 2014 లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని సినిమాలకు, ప్రేక్షకులకు శాశ్వతంగా దూరమయ్యారు.

అయితే చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ ని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలను వెల్లడించారు. ఉద‌య్ కిర‌ణ్ అమాయ‌కుడని, చాలా మంచివాడ‌ని.. ఇండ‌స్ట్రీలో ఉన్న ప‌రిస్థితులు అర్థం చేసుకోలేక చ‌చ్చిపోయాడ‌ని చెప్పారు. ఇక్క‌డి మ‌న‌షుల‌ను అర్థం చేసుకోవ‌డం అంత ఈజీ కాద‌న్నారు. ఇక ఉద‌య్ కిర‌ణ్ మాన‌సిక స్థితి కూడా బాగోలేద‌ని.. వాళ్ళింట్లో అన్న‌య్య కూడా ఆత్మ‌హత్యే చేసుకున్నాడ‌ని తేజ‌ చెప్పారు. ఈ కుర్రాడికి కూడా అదే స‌మ‌స్య ఉండేద‌ని.. 'ఔన‌న్నా కాద‌న్నా' సినిమాకు ముందే ఓ సారి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించాడని తెలిపారు. అప్పుడే ఆపి ఆయ‌న‌తో సినిమా చేసాన‌ని, అయితే ఆ త‌ర్వాత మాత్రం కుద‌ర్లేదని చెప్పారు. ఏదేమైనా ఓ మంచి మ‌నిషిని కోల్పోవ‌డం బాధ క‌లిగించింద‌ని తేజ‌ అన్నారు.