రెస్ట్‌ తీసుకోవాలంటూ దిగ్విజయ్‌‌పై కాంగ్రెస్‌ నేతల సెటైర్లు

దిగ్విజయ్‌‌సింగ్‌...  కాంగ్రెస్‌ సీనియర్‌ మోస్ట్‌ లీడర్‌... వయసులోనే కాదు పదవిలోనూ పెద్ద పోస్టే... కానీ అసలు మ్యాటర్‌ మాత్రం లోకల్‌ లీడర్‌ కన్నాఘోరం. వెంటిలేటర్‌పై ఉన్న పార్టీకి ఆక్సిజన్‌ అందిస్తాడని ఆశపడ్డ  నేతల్లో గుబులు పెంచుతున్నాడు. సార్‌గారీ  మ్యాజిక్‌తో  కనీసం ఒక్క చోట కాకపోయినా మరో చోట అధికారంలో వస్తామని గంపెడు ఆశలు పెట్టుకున్న పార్టీ ఆశలు నెరవేరే సూచనలు మాత్రం కనిపించడం లేదు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ పెద్దాయనను ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌ను ముందుకు తీసుకెళ్తారన్న ఆలోచనతో ఇన్‍ఛార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టారు. కానీ దిగ్విజయ్‌ మాత్రం పార్టీని పైకి తీసుకురావడమేమో కానీ... అసలు  పార్టీని కనుమరుగయ్యేలా చేస్తున్నాడనే విమర్శలను మూటకట్టుకున్నాడు.

 

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ నిలిచింది. దాంతో మంచి రోజులతోపాటు... అభయం దొరికిందనుకుని ఆశపడ్డ గోవా కాంగ్రెస్‌ నేతలకు నిరాశే ఎదురైంది. ఎక్కువ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచినా... అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. దాంతో గోవా కాంగ్రెస్‌ నేతలు  దిగ్విజయ్‌‌పై గుర్రుగా ఉన్నారు. పదవి నుంచి తప్పుకోవాలని మాటల యుద్ధం మొదలుపెట్టారు. కొందరైతే దిగ్విజయ్‌ ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

సొంత పార్టీ నేతల నుంచి మొదలైన మాటల తూటాలు దిగ్విజయ్‌‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్‌లో నెలకొంటున్న  పరిస్థితులతో... డిగ్గీ సాబ్‌కు డెడ్‌లైన్‌ దగ్గరపడినట్లు కనిపిస్తోంది. కంటెంట్‌ ఉన్నోడని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తే... పార్టీనే మడతెట్టేస్తున్నాడని అంటున్నారు. 

 

ఇక తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ఇన్‌‌ఛార్జ్‌గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌.... ఇక్కడ కూడా గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీలో చిచ్చు పెడుతున్నారని అంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్యతిరేకంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఎగదోస్తూ, నేతల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని టీ-కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.