వినాశకాలే విపరీత బుద్ధి

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నశాసనసభలో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా సుదీర్గమయిన వాదన చేసిన తరువాత లోపభూయిష్టమయిన ఆ బిల్లుని వెనక్కి త్రిప్పి పంపమని కోరుతూ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. అంతేగాక బిల్లుని వ్యతిరేఖిస్తూ తీర్మానం నోటీసు కూడా ఇచ్చారు. దీనిపై తెలంగాణావాదులందరూ మండిపడుతున్నారు. కానీ, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం ముఖ్యమంత్రి కొత్తగా చెప్పిందేముందంటూ ఆయన వాదనలను చాలా తెలికగా కొట్టిపడేశారు.

 

శాసనసభ అభిప్రాయలు తెలుసుకోవడానికి మాత్రమే బిల్లును పంపాము, గనుక అందరూ తమ అభిప్రాయలు చెప్పవచ్చని, ఇంతవరకు 87మంది సభ్యులు తమ అభిప్రాయాలు చెప్పారని, వారందరికీ కృతజ్ఞతలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చెపుతున్నట్లుగా బిల్లులో లోపాలు ఉన్నట్లయితే వాటికి పరిష్కారాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయని ఆయన అన్నారు.

 

ముఖ్యమంత్రి నిన్న సభలో మాట్లాడుతూ, జస్టిస్ జీవన్ రెడ్డి తీర్పుని పేర్కొంటూ రాష్ట్రానికి సంబంధించిన అంశంపై శాసనసభకు సర్వ హక్కులు ఉంటాయని, చేతిలో అధికారం ఉంది కదా అని కేంద్రం రాష్ట్ర శాసనసభ యొక్క హక్కులను కబళించలేదని గట్టిగా వాదించారు. ఆ హక్కులున్నందునే కేంద్రం బిల్లుని రాష్ట్ర శాసనసభకు పంపిందని, అందువల్ల బిల్లుని ఆమోదించే, వ్యతిరేఖించే హక్కు రాష్ట్ర శాసనసభకు ఉంటుందని ఆయన గట్టిగా వాదించారు. కానీ, దిగ్విజయ్ సింగ్ మాత్రంబిల్లుకి వ్యతిరేఖంగా రాష్ట్ర శాసనసభ ఎటువంటి అభిప్రాయలు వ్యక్తం చేసినా చివరికి తిరస్కరించినా దానిని పట్టించుకొనవసరం లేదనే విధంగా మాట్లాడుతున్నారు. అంతేగాక యావత్ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, అధికార, ప్రతిపక్ష శాసనసభ్యుల అభిప్రాయానికి అసలు విలువేలేదనట్లు మాట్లాడటం చూస్తే ఆయనకు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి రాజ్యాంగ విధానాల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోంది. రాష్ట్ర శాసనసభకు, ముఖ్యమంత్రి మాటలకు విలువే లేదని కాంగ్రెస్ భావిస్తున్నపుడు వారిని అపహాస్యం చేయడానికే పంపినట్లవుతుంది.

 

బిల్లులో లోపాలు ఉంటే వాటికి రాజ్యాంగంలో పరిష్కారాలు కూడా ఉన్నాయని ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో కానీ, కాంగ్రెస్ అధిష్టానం తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లుని ఎన్ని మెలికలు తిప్పినా, ఒకవేళ రాష్ట్రపతి బిల్లుపై వచ్చిన అభ్యంతరాలను, వ్యతిరేఖంగా వచ్చిన వాదనలను, ఇరుప్రాంతాలవారు కోరుతున్న సవరణలను పరిగణనలోకి తీసుకొన్నట్లయితే, అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సంజాయిషీలు, వివరణలు చెప్పుకోవలసివస్తే తల దించుకోక తప్పదు.

 

ఒకవేళ ఆయన అభ్యంతరం చెప్పకపోయినా, రేపు బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయినప్పుడు, బిల్లు రాజ్యాంగ సూత్రాలకు విరుద్దంగా రూపొందించబడిందని కోర్టు భావిస్తే, అప్పుడు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లుగానే వాటికి రాజ్యాంగ ప్రకారం పరిష్కారాలు చూపమని కేంద్రాన్ని ఆదేశిస్తే పోయేది కాంగ్రెస్ పరువే తప్ప రాష్ట్ర శాసనసభ పరువు కాదు.

 

బిల్లు తిరిగి వచ్చిన తరువాత దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తామని  ఒక్క ముక్కతో దిగ్విజయ సింగ్ సరిపెట్టి ఉందవచ్చును. కానీ, శాసనసభ బిల్లుపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినా మాకు నష్టం లేదనడం అహంకారమే. కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కట్టబెట్టిన తెలుగు ప్రజల పట్ల దిగ్విజయ్ సింగ్ ఇంత చులకన భావం ఎందుకు ప్రదర్శిస్తున్నారో, ఇంత అవమానకరంగా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. ఆయన మాటల వలన సీమాంధ్రలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖత పెరగడం తధ్యం.

 

కాంగ్రెస్ వ్యూహం ప్రకారం సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటుతో తన రహస్య మిత్రులకు రాజకీయ లబ్ది చేకూర్చి వారి నుండి మద్దతు పొందాలని భావిస్తోంది గనుకనే ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ప్రజలలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖతను పెంచే ప్రయత్నం చేస్తున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. వినాశకాలే విపరీత బుద్ది అని దీనినే అంటారేమో!