ఆ తంతు కూడా ముగించేసిన ధర్మాన

 

ధర్మాన ప్రసాదరావు సీబీఐ కేసుల పుణ్యామాని తన మంత్రి పదవి ఊడగొట్టుకొన్నారు కానీ, లేకుంటే నేటికీ కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పుతూనే ఉండేవారు. ఆయనను కాపాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించారు, కానీ ఫలితం లేక పోవడంతో ఇక చేసేదేమి లేక ధర్మాన రాజీనామా చేసి బయటపడ్డారు. పదవిలో ఉన్నంత కాలమే ఎవరినయినా అందరూ గుర్తిస్తారు. అవి పోయిన మరుక్షణం వారిని కాంగ్రెస్ పార్టీలో పలకరించేవారు ఉండరు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, ధర్మాన, సబిత వంటి వారే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

 

అటువంటప్పుడు వారు మళ్ళీ ఒంటరి పోరాటానికయినా సిద్దపడాలి, లేకుంటే వేరే పార్టీలలోకయినా మారిపోవలసి ఉంటుంది. ఎన్నికలు తరుముకొస్తున్నఈ తరుణంలో మొదటి ఆప్షన్ కంటే రెండవదే ఆచరణీయంగా ఉంటుంది గనుక ధర్మాన కూడా వైకాపాలోకి దూకేసేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. అయితే పార్టీ మారేందుకు నిశ్చయించుకొన్నతరువాత ఈ జంపింగ్ ప్రక్రియలో శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన తంతు, అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టి పోయడం, జగన్మోహన్ రెడ్డికి గొప్పదనం గురించి బాకా ఊదడం తదితర కార్యక్రామాలను ఆయన అందరి కంటే కొంచెం విభిన్నంగా నిర్వహించారు ఆయన తన అనుచరులతో కలిసి మొన్న శ్రీకాకుళంలో బహిరంగ సభకు తక్కువ, కార్యకర్తల సమావేశానికి ఎక్కువ అనదగ్గ ‘సమాలోచన’ అనే బహిరంగసమావేశం ఏర్పాటు చేసి ఆ తంతు శాస్త్ర ప్రకారం పూర్తి చేసేసారు.

 

ఆయన ఈ సమావేశంలో తన కాంగ్రెస్ కళ్ళద్దాలను తీసి పక్కకు పడేయగానే అంతవరకు దేవతలా కన్పించిన సోనియా గాంధీ ఆయనకు దయ్యంలా, 125 సం.లచరిత్ర గల గొప్ప పార్టీ అని స్వయంగా పొగిడిన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా కనబడింది. ఇక వైకాపా ఇచ్చిన కళ్ళద్దాలను పెట్టుకోగానే అంతవరకు స్పష్టంగా కనబడిన జగన్మోహన్ రెడ్డి యొక్క సీబీఐ రికార్డులు, అక్రమ సంపాదన చరిత్రలు ఏవో అర్ధం పర్ధం లేని పిచ్చిరాతలులా కనబడటం మొదలయ్యాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిలో ఇంతవరకు తను చూడలేకపోయిన గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా వైకాపా కళ్ళద్దాలు ధరించాగానే స్పష్టంగా కనబడతునట్లు ఆయన సభా ముఖంగా ప్రకటించారు.

 

ఇక శాస్త్రోక్తంగా తన ధర్మం తను నిర్వహించారు గనుక ఇక జగన్ వచ్చి వైకాపా కండువా కప్పడమే ఆలస్యం. మరీ ఆలస్యం చేస్తే అందరూ ‘ఇదేమి ధర్మం ధర్మానా?’ అంటే అనుకొంటే అనుకోవచ్చునేమోగానీ ఆయన మాత్రం మళ్ళీ ఇదే తంతు మరొకమారు నిర్వహించేసి ఏ కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకో జంపయిపోయే ప్రమాదం ఉంది. లేకుంటే సబ్బంహరిలాగే ఆయన కూడా తన కాంగ్రెస్ కండువాను ఓసారి గంజి పెట్టి ఉతికించేసుకొని మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరే అవకాశము లేకపోలేదు.