‘రాయల’కు సానుకూలత?!

 

 

 

హైదరాబాద్ రాజధానిగా, పది జిల్లాలతో కూడిన ఆంక్షలు లేని తెలంగాణ కావాల్సిందేనని నిన్న మొన్నటి వరకూ నిర్మొహమాటంగా, నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా ప్రకటిస్తూ వచ్చిన విభజనవాదుల్లో ఇప్పుడు మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న విషయం స్పష్టమవుతున్న సందర్భంలో కరడుగట్టిన తెలంగాణ వాదుల్లో కూడా మార్పు కనిపిస్తోంది.

 

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ దగ్గర కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ ప్రస్తావన తెచ్చినప్పుడు మామూలుగా అయితే ఆయన ఆవేశాన్ని ప్రదర్శించేవారు. గతంలో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణకు వ్యతిరేకమైన ప్రతిపాదనలు వచ్చినప్పుడు సమావేశం మధ్యలో నుంచే ఆవేశంగా బయటకి వచ్చిన ట్రాక్ రికార్డు ఆయనకు వుంది. అయితే మొన్న కేంద్రం ఆయన రాయల తెలంగాణ ప్రస్తావన తెచ్చినప్పుడు మాత్రం ఆయన గతంలో ప్రదర్శించిన ఆవేశం ప్రదర్శించలేదు. రాయల తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం తమకు కనిపించడం లేదని, దీనికి కాదంటే అసలు రాష్ట్ర విభజన అంశాన్నే మూలన పడేసే ప్రమాదం వుందని దామోదరకు బ్రెయిన్ వాష్ చేయడంతో ఆయన రాయల తెలంగాణకు ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకున్నట్టు సమాచారం.


సమావేశం నుంచి బయటకి వచ్చిన తర్వాత దామోదర మాట్లాడిన తీరులో రాయల తెలంగాణ పట్ల ఆయన వ్యతిరేకతను పెద్దగా కనబరచలేదు. తెలంగాణ కాంగ్రెస్‌లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తున్న వారందరికీ అధిష్ఠానం బ్రెయిన్ వాష్ చేసే పనిలో బిజీగా వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఈ పరిణామానికి సానుకూలతను వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీ కాంగ్రెస్ పరిస్థితి ఇలా వుంటే, టీఆర్ఎస్ పార్టీలోనూ రాయల తెలంగాణకు ఓకే అంటే ఓ పనైపోతుంది కదా అన్న అభిప్రాయాలు వ్యకమవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ అని పట్టిన పట్టు విడవకుండా, తెగేదాకా లాగడం మంచిది కాదన్న అభిప్రాయంలో కొందరు టీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టు సమాచారం. రాయల తెలంగాణ ఇస్తే శ్రీశైలం ప్రాజెక్టు భూములు ఏ ప్రాంతానివన్న సమస్య సమసిపోతుందని, అలాగే వైశాల్యంలో, పార్లమెంటు – అసెంబ్లీ సీట్ల విషయంలో సీమాంధ్రతో సమానంగా వుండొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.