ముఖ్యమంత్రి ఉద్వాసనకి రంగం సిద్దం అయినట్లేనా

 

మాజీ డీజీపీ దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలలో నిజానిజాలెలా ఉన్నపటికీ, అవి ముఖ్యమంత్రి ఉద్వాసనకు అవసరమయిన తగిన పరిస్థితులను సృష్టించగలిగాయి. రాష్ట్ర విభజన నిర్ణయం జరిగినప్పటి నుండి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్నప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తొలగిస్తే సీమంద్రాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయనే భయంతో ఇంత కాలంగా సంకోచిస్తున్నకాంగ్రెస్ అధిష్టానానికి, ఇప్పుడు ఆయనను తొలగించడానికి మార్గం సుగమం అయింది. అందువల్ల ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ‘హస్తం’ కూడా ఏమయినా ఉందా? అనే అనుమానాలున్నాయి.

 

అదేవిధంగా రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెపుతున్నఒకరిద్దరు సీమంద్రా మంత్రులు కూడా ముఖ్యమంత్రికి దినేష్ రెడ్డి చేత కిరణ్ కుర్చీకి ఎసరు పెట్టిస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి.

 

ఏమయినప్పటికీ, దినేష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కిరణ్ వ్యతిరేఖ వర్గాలన్నిటినీ ఒక త్రాటిపైకి తెగలిగాయి. రాష్ట్రవిభజనను అడ్డుకొంటున్నందుకు ఆగ్రహంగా ఉన్నతెరాస, టీ-కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు, ఆయన సమైక్యవాదంతో హీరోగా ఎదుగుతూ తమను పెద్ద జీరోలను చేసినందుకు కోపంగా ఉన్న కొందరు సీమాంధ్ర మంత్రులు, గతంలో కిరణ్ దెబ్బకు బలయిన మంత్రులు, తన నిర్ణయాన్నే సవాలు చేస్తున్నదుకు ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుండి తప్పించవలసిన అవసరం ఉందని భావించేందుకు ఎవరి కారణాలు వారికున్నాయి.

 

కాంగ్రెస్ అధిష్టానం కూడా తన హస్తానికి బురద అంటకుండా కాగల కార్యం గందర్వులే పూర్తి చేసినట్లు ఈవిధంగా దినేష్ రెడ్డి ముఖ్యమంత్రిని తొలగించడానికి మార్గం సుగమం చేస్తున్నపుడు కాదనేందుకు ఏముంటుంది?ఇక భక్తులు భగవంతుడు ఒకటే కోరుకొంటున్నపుడు ఇంకా ఆలస్యం దేనికి?

 

బొత్సవత్సలమయిన కాంగ్రెస్ అధిష్టానం ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని, త్వరలోనే సమైక్య కిరణాన్ని ఆర్పివేసి ‘తన వీర భక్తుడి కోరిక’ తీరుస్తుందేమో?