పన్నెండేళ్ల క్రితం వైఎస్సే పక్కన పెట్టాడు.. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా?

 

నిన్న జరిగిన ఎపి క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలపై దేవినేని ఉమ మాట్లాడుతూ, నిన్న క్యాబినెట్ లో ఒక తీర్మానం చేయబడింది అని 2007లో ఆనాటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ జీవో ఇచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా వార్తలు రాస్తే ఐఎంపీఆర్ సంబంధిత శాఖ కోర్టులో కేసులు వేసే విధంగా, ప్రాసిక్యూట్ చేసే విధంగా ఆనాడు జీవో తీసుకొచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా, స్థానిక మీడియా ప్రధాన ప్రతిపక్షాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోజు పోరాటం చేస్తే ఆ జీవోను పక్కనబెట్టారు అని ఉమ అన్నారు.

మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారం నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, ఈటీవీ, టివీ5 ఇవన్నీ ఎల్లోమీడియా అని వాటి సంగతి తేలుస్తా అని జగన్ అన్నారని దాంట్లో భాగంగా నాలుగు నెలలులోనే తండ్రి ఇచ్చిన జీవోకే నగిషీలూ చెక్కాడన్నారు దేవినేని ఉమ. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కొత్త కొత్త అర్ధాలిచ్చే విధంగా ఎవరు అయినా వార్తలు రాస్తే సంబంధిత శాఖ అధికారులు పరువు నష్టం దావా వేయాలని, కోర్టుకెళ్లాలని, ప్రాసిక్యూట్ చేయాలని జగన్ సూచించారని అన్నారు.

దీనిపై నిన్న క్యాబినెట్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంబంధిత శాఖలు, ప్రిన్సిపల్ సెక్రెటేరియట్స్ అందరికీ అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేశారని ఇది చాలా దురదృష్టకరమని, ప్రతి సామాన్యుడు ఈరోజున ఎటువంటి అన్యాయం జరిగినా మీడియా ద్వారానే నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, అలా ప్రశ్నించే వారి అందరిపై జగన్ కేసులు పెట్టాలని చూస్తున్నారని దేవినేని ఉమ అన్నారు.