విశాఖలో వరుసగా పెద్దల చేతుల్లోకి బడా సంస్థలు!!

పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని తరలింపు కంటే ముందే విశాఖలోని బడా సంస్థలను కొందరు పెద్దలు హస్తగతం చేసుకుంటున్నారని తెలుస్తోంది.

 

విశాఖలోని కీలకమైన ప్రాజెక్టులను చేజిక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నారట. ముఖ్యంగా ప్రభుత్వ, పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో భూములు తీసుకుని వ్యాపారాలు నడుపుతున్న వారిపై దృష్టి సారించారని తెలుస్తోంది. ఇప్పటికే కార్తీకవనం ప్రాజెక్టులో కొంత వాటా దక్కించుకున్నారు. విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో సాగర్‌నగర్‌ సమీపాన బీచ్‌ రిస్టార్‌ను పీపీపీలో అభివృద్ధి చేయడానికి ఓ సంస్థ పదేళ్ల క్రితం ఒప్పందం చేసుకోగా.. అది ఇప్పటికి పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అందులో కొంత వాటాను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో కొనుగోలు చేయించారని ప్రచారం జరుగుతోంది.

 

తాజాగా అదే ప్రాంతంలో కొండపై నడుస్తున్న 'బే పార్క్‌' ఎకో టూరిజం ప్రాజెక్టును కూడా చేజిక్కించుకున్నారని తెలుస్తోంది. పర్యాటక శాఖకు చెందిన స్థలంలో ఎకో టూరిజం ప్రాజెక్టు పెడతామని ఇండో అమెరికన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ సంస్థ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంది. ఈ కొండపై అంతర్జాతీయ ప్రమాణాలతో వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 138 గదులతో, ప్రకృతి సిద్ధమైన విధానాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యం అందించే రిసార్ట్‌గా అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు సుమారు రూ.120 కోట్లు వెచ్చించారని అంచనా. ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగి 18 ఏళ్లు కావస్తున్నా.. ఇది అందుబాటులోకొచ్చి మూడు, నాలుగేళ్లే అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే అధికార పార్టీ నాయకుల దృష్టిపడిందని తెలుస్తోంది. 

 

రాజధానిని విశాఖకు మారుస్తున్నందున సీఎం నివాసం కోసం బే పార్క్ భవనాలను కూడా పరిశీలించారట. ఆ తర్వాత విశాఖ సమీపంలో భారీ ఫార్మా కంపెనీలు నడుపుతున్న రెండు సంస్థలు బే పార్కులో అధిక శాతం వాటాను చేజిక్కించుకున్నాయి. నిర్వాహకులు బ్యాంకు నుంచి తీసుకున్న రూ.100 కోట్ల రుణాన్ని కొత్త భాగస్వాములు తీర్చేలా, పాతవారికి కొంత శాతం వాటా ఇచ్చేలా అంగీకారం కుదిరిందని సమాచారం. అంతేకాదు, బే పార్క్‌లోని కొంత భాగాన్ని సీఎం నివాసంగా మారుస్తారని ప్రచారం జరుగుతోంది.

 

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ప్రభుత్వ భూమిని ఎవరైనా అభివృద్ధి చేయడానికి తీసుకుంటే.. పదేళ్ల తర్వాత కావాలనుకుంటే దాన్ని కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కార్తీకవనం ఒప్పందం జరిగి పదేళ్లు దాటింది, అలాగే బే పార్క్‌ ఒప్పందం జరిగి 18 ఏళ్లు అయింది. దీంతో కొత్త విధానం కింద ఈ రెండింటినీ అధికార పార్టీ నాయకులు నామమాత్రపు ధరకు పూర్తిగా చేజిక్కించుకునే అవకాశం ఉందని, అందుకే కొత్త పాలసీలో ఆ నిబంధన చేర్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

కాగా, విశాఖలోని బడాసంస్థలు చేతులు మారడంపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "విశాఖలో వరుసగా 'పెద్దల' చేతుల్లోకి బడాసంస్థలు. మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్. ఇండస్ట్రియల్ విధానంలో నిబంధనల మార్పు ఫార్మాకంపెనీలకు ఉపయోగపడ్డాయా? వాటాకొన్న ఫార్మాకంపెనీలు ఏవి? అప్పులు ఎవరు తీరుస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయంకోసం ఏర్పాట్లు నిజమేనా? ప్రజలకి చెప్పండి వైఎస్ జగన్ గారు" అంటూ సీఎం వైఎస్ జగన్ పై దేవినేని ప్రశ్నల వర్షం కురిపించారు. మరి గతంలో అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపించిన అధికార పార్టీ నేతలు.. ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.