దేవినేని అవినాష్ వ్యూహం ఏంటి ?....బెదిరిస్తున్నారా ? బలవుతున్నారా ?

 

"ఏపీ టీడీపీకి మరో భారీ షాక్‌. తెలుగుయువ‌త రాష్ట్ర అధ్య‌క్షుడు, గత ఎన్నికల్లో గుడివాడ నుండి కొడాలి నాని మీద పోటీ చేసి ఓడిన దేవినేని అవినాశ్ టీడీపీని వీడనున్నారు, అవినాశ్ నాయక‌త్వంలో  కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవినేని నెహ్రూ అనుచ‌రులు..అభిమాను లు టీడీపీని వీడి వైసీపీలో చేర‌నున్నారు" ఇదీ రెండ్రోజుల నుండి జరుగుతున్న ప్రచారం. నిజానికి ఈ ప్రచారంలో పెద్ద వింతేమీ లేదు. ఎందుకంటే ఇలాంటి ప్రచారాలు రావడం షరా మామూలు విషయమే. 

అయితే ఈ విషయం మీద దేవినేని అవినాష్ స్పందించకపోవడమే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. నిజానికి గుడివాడ నియోజకవర్గ టికెట్ దేవినేనికి అప్ప చెప్పడం అప్పట్లోనే గుడివాడ పార్టీ నేతలకు నచ్చలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఆయన నాయకత్వంలో పని చేశారు. కానీ ఎన్నికలు పూర్తయి రెండు నెలలు కూడా కాకముందే ఆయన పార్టీ మారతారు అని ప్రచారం జరగడం దానికి ఎటువంటి ఖండన అవినాష్ నుండి రాకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.  

మొన్న జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఓటమి పాలయ్యింది. ఎవరూ ఊహించని రీతిలో ఫలితాలు వెలువడ్డ రోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పై దాడులు మొదలు అయ్యాయి. నిజానికి ఈ షాక్ కి సీనియర్ నేతలు , రాష్ట్ర నాయకత్వం బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయింది. కానీ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయేలా అవినాష్ దాడి జరిగిన వారి ఇళ్ళకి వెళ్లి తెలుగుదేశం కార్యకర్తలకు అండగా తాను ఉంటానని ప్రకటించాడు. 

అయితే అలా ప్రకటించడమే పార్టీలో అంతర్గత విభేదాలకి కారణం అయ్యిందని విశ్లేషకుల అంచనా. అదేంటంటే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు రాష్ట్రంలో కార్యకర్తలు అందరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి ? అని కొందరు సీనియర్ నేతలు అధిష్టానం వద్దకు విషయం తీసుకువెళ్ళారట. అయితే అలా చేయడం కరెక్ట్ కాదనే అర్ధం వచ్చేలాగా అధిష్టానానికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారని టాక్. 

ఎక్కడ ఎదిగిపోయి జిల్లా నాయకత్వంలో పోటీతో పాటు రాష్ట్ర నాయకుడిగా ఎదిగిపోతాడేమో అనే భయంతో తమ అనుకూల మీడియా వర్గాలతో కొందరు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారని ఒక ప్రచారం కూడా దేవినేని అనుచరులు మొదలుపెట్టారు. పార్టీ వీడే వార్తల మీద స్పందించిన ఆయన అనుచరులు ఈ వార్తల్లో నిజం లేదని కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. 

అవినాష్‌కు పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియాలో వస్తున్న వదంతుల్ని నమ్మొద్దంటున్నారు. ‘దేవినేని అవినాష్ గారు వైసీపీ లోకి వెళుతున్నారు... వెళ్లిపోయారు అని వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆయన పార్టీ మారలేదు, మారబోరు కూడా !. విశ్వసనీయ వర్గం నుంచి సమాచరం వచ్చింది కాబట్టి ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. తప్పుడు ప్రచారాలు చేసి స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు’అంటూ గుడివాడ తెలుగు దేశం పార్టీ ఫేస్‌బుక్‌ పేజీలో క్లారిటీ ఇచ్చింది. 

అయితే ఈ వ్యవహారంలో అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా లోకేష్ వలెనే అవినాష్ పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. నిజానికి ఎన్నికల సమయం నుండే లోకేష్ తనను అవమానించేలా ప్రవర్తిస్తున్నాడు అని అవినాష్ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఎప్పుడు లోకేష్, చంద్రబాబులు ఎయిర్ పోర్ట్ కి వచ్చినా రిసీవ్ చేసుకోడానికి అవినాష్ వెళుతున్నారట. 

కానీ అప్పుడు అంత ప్రాధాన్యం ఇవ్వకపోగా బుద్ధాని వెంటపెట్టుకుని లోకేష్, చంద్రబాబులు వెళ్ళిపోతున్నారని సమాచారం. అదీ కాక విజయవాడ కార్పోరేషన్ పరిధిలో అవినాష్ కొన్ని కార్పొరేటర్ సీట్లు అడిగితే చంద్రబాబు లేదు పోమ్మన్నారని, అక్కడ అంతా గద్దె రామ్మోహన్ మాటే ఫైనల్ అని అన్నారని, ఇలా అన్ని చోట్లా అవమానాలు ఎదురు కావడంతో అవినాష్ తట్టుకోలేక పోతున్నారని సమాచారం. 

అందుకే పార్టీ మారుతున్నట్టు అవినాషే ప్రచారం చేయిస్తున్నారని కొన్ని వర్గాల నుండి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఆయన చంద్రబాబుతో భేటీ కానున్నారని ఈ భేటీలో తనకు పెనమలూరు నియోజకవర్గ బాద్యతలు ఇమ్మని అడిగే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ నుండి నేతల జంపింగ్ లతో విసిగి ఉన్న చంద్రబాబు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి.