నిబద్ధత వుంటే.. విజయం నీ వెంటే...

కథ అనగానే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా ! అలాగే ఆ కథ కొద్దో గొప్పో మనకి జీవిత పాఠాన్ని నేర్పించేది అయితే మనం ఎప్పటికీ మరచిపోలేము. అలా నాకు ఎంతో బాగా గుర్తుండిపోయిన ఒక కథని ఈరోజు మీకు చెప్పబోతున్నా.  నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నా స్నేహితురాలు ఈ కథని చెప్పింది... మన బాధ్యత విషయంలో మన నిబద్ధత ఎలా ఉండాలి అని. 

ఇంతకీ కథ ఏంటంటే... ఒక ఊరిలో ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ ఆఫీసు ఉంటుంది. అందులో ఉద్యోగానికి ఏమాత్రం అనుభవం లేని ఒక కుర్రాడు వెడతాడు. నీకు ఏ పని వచ్చు అంటే ఏమీ రాదు... కానీ నేర్చుకుంటాను అంటాడు. అప్పుడు ఆ యజమాని నేర్చుకోవాలనే తపన, చేసే పనిమీద నిబద్ధత ఉంటే నీవు తప్పకుండా గొప్పవాడివి అవుతావు.  చేసే ప్రతీ పని మీద నీవు 100% శ్రద్ధ పెట్టు అని చెప్పి, ఆ కుర్రాడికి  ఉద్యోగం ఇస్తాడు. కొన్ని రోజులకి  వడ్రంగం పనిలో  మంచి ప్రావీణ్యం సంపాదిస్తాడు ఆ కుర్రాడు .  ఇలా క్రమక్రమంగా ఆ కుర్రాడి నైపుణ్యాలు పెరగటం, దానితో ఆ ఆఫీసులో అతని హోదా పెరగటం జరిగింది. 

అతను ప్రతీపనిని 100% శ్రద్ధ పెట్టి చేసేవాడు కాబట్టి  అతను చేసే ప్రతీపనీ ఎంతో గొప్పగా ఉండేది. నెమ్మది నెమ్మదిగా భవనాలు నిర్మించడంలో, అన్ని పనుల్లో అవగాహన పెంచుకుంటాడు. ఆఫీసులో అతని హోదా, అవసరం, గౌరవం అన్నీ రోజురోజుకూ పెరుగుతాయి. అతను కూడా తాను చేసే ప్రతీపనిని ఎంతో శ్రద్ధతో, ఇష్టంతో చేయటంతో ఎంతో తృప్తిని పొందుతూ ఉంటాడు. తాను కట్టే ప్రతీ ఇల్లు ఒక అద్భుత కళాఖండంగా నిలవాలని తపించిపోతాడు.

ఈవిధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. యజమాని వయసు మీద పడటంతో వ్యాపారాన్ని కొడుకుకి అప్పగిస్తాడు. కొడుకుకి ఈ వ్యాపారం కొత్త అవ్వటం వలన ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్నఆ కార్పెంటర్  అతనికి తోడుగా నిలుస్తాడు. ఇతని ఆధ్వర్యంలో యజమాని కొడుకు త్వరలోనే అన్ని మెళకువలు నేర్చుకుంటాడు  అందువల్ల ఆ కుర్రాడు  అంటే కొడుకుకి ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. ఈవిధంగా ఉండగా కొన్ని సంవత్సరాలకి ఆ కార్పెంటర్  వయసు పెరగటంతో  పనిచేయటం కష్టంగా మారుతుంది. దానితో ఉద్యగం మానేయ్యాలి అనుకుంటాడు. ఈ విషయాన్ని యజమానికి, అతని కొడుకుకి తెలియచేస్తాడు. 

విషయం విన్న అతని యజమాని కొడుకు "తప్పకుండా నువ్వు రెస్ట్ తీసుకోవలసిన  వయసే... కానీ ఒక్క ప్రాజెక్ట్ ఉంది, ఒక ఇల్లు అద్భుతంగా కట్టాలి. ఇంతవరకు నువ్వు కట్టిన ఇళ్ళకంటే అద్భుతమైనది అయి ఉండాలి. ఈ ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేసి రిటైర్ అవ్వు"  అని అంటాడు. సరే అని అంగీకరించి, ఆ కార్పెంటర్  తన చివరి ప్రాజెక్ట్ పని మొదలుపెడతాడు. 

ఐతే అతనికి  ఈ ప్రాజెక్ట్ మీద పెద్దగా శ్రద్ధ లేదు. ఏదో త్వరగా పూర్తిచేస్తే ఇక రిటైర్ అవ్వవచ్చును అనే ఆలోచనతో మొదటిసారిగా ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఇల్లు కట్టిస్తాడు. నాసిరకం వస్తువులు, సరిగా లేని డిజైన్లతో కట్టిస్తాడు. ఆ భవనం కట్టడంలో అతని అశ్రద్ధ అడుగడుగునా కనబడుతుంది. ఇల్లు పూర్తవుతుంది. ఇక బాధ్యతలనుండి తప్పుకోవచ్చును అని భావించి పూర్తి అయిన ఇంటి యొక్క తాళాలు యజమానికి ఇస్తాడు. అప్పుడు ఆ  యజమాని ఆ తాళాలను తిరిగి ఆ కార్పెంటర్  చేతిలో పెట్టి "ఇన్ని సంవత్సరాలు నువ్వు శ్రద్ధగా పనిచేసినందుకు ఇది నేను నీకు ఇచ్చే బహుమానం స్వీకరించు. నీ ఇల్లు నీకు నచ్చినట్టు కట్టుకోవాలనే ఈ ప్రాజెక్ట్ చెయ్యమని చెప్పాను" అని అంటాడు. 

ఇది విని కార్పెంటర్ నివ్వెరపోతాడు అతను  తన ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా చేసిన మొదట పని ఈ ఇల్లు కట్టించడం. అంటే తనకు బహుమతిగా వచ్చిన  ఈ ఇల్లు జీవితాంతం తన అశ్రద్ధకి గుర్తుగా  తన  కళ్ళెదుట నిలుస్తుంది. బాధగా అనిపిస్తుంది అతనికి. నిబద్ధత  అంటే ఎప్పుడూ, ఎలాంటి పరిస్థితులలోనూ రాజీ పడకుండా వుండటం అని తెలుసుకుంటాడు.

 

-రమ