ఫేస్‌బుక్‌తో డిప్రెషన్‌ తప్పదా!

 


ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌ అన్న మాటతో పరిచయం లేని మనిషిని గుర్తించడం కష్టం. కాస్తో కూస్తో కంప్యూటర్‌ పరిజ్ఞానం కలగగానే ఓ ఫేస్‌బుక్‌ ఖాతాని తెరిచేయడం... కుదిరితే ఓ పోస్టు, లేకపోతే ఓ లైకు అంటూ ఫేస్‌బుక్కే జీవితంగా గడిపేయడం సహజం. కానీ విచక్షణారహితంగా ఫేస్‌బుక్‌ని వాడితే మానసిక సమస్యలు తప్పవంటూ రెండు తాజా పరిశోధనలు రుజుబుచేస్తున్నాయి.

 

పరిశోధన 1 - చూస్తూ ఉండిపోవద్దు:

చాలామంది ఫేస్‌బుక్‌ని ఊరికే అలా చూస్తూ ఉంటారు. అందులో కనిపించే పోస్టులను గమనిస్తూ, ఎవరికెన్ని లైక్‌లు పడ్డాయో లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు డిప్రెషన్‌కి లోనయ్యే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ‘కోపెన్‌హేగెన్ విశ్వవిద్యాలయాని’కి చెందిన పరిశోధకులు ఓ వెయిమందిని సంప్రదించారు. సోషల్ మీడియాతో వారి అనుబంధం ఎలాంటిదో గమనించారు. ఈ వేయిమందిలో ఎక్కువగా స్త్రీలే ఉండటం గమనార్హం.
వాళ్ల పోస్టులూ, వీళ్ల పోస్టులూ చూస్తూ గడపడం వల్ల వాటితో మన జీవితాలను బేరీజు వేసుకునే ప్రమాదం ఉందని తేలింది. సహజంగానే సోషల్‌మీడియాలో ఉండే వ్యక్తులు తమ ఘనతనీ, ఆడంబరాన్నీ చాటుకునేందుకు వీలుగా డాబుసరి పోస్టులు పెడుతుంటారు. వీటితో లేనిపోని పోలికలు ఏర్పడతాయి. ఇక మనలో అసూయ, క్రుంగుబాటు వంటి సమస్యలను రెచ్చగొట్టే పరిస్థితులు కలుగుతాయి.

 

ఇలాంటి చిత్రమైన సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని పరిష్కరాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఊరికనే ఫేస్‌బుక్‌ వంక అలా చూస్తూ ఉండిపోవద్దనీ... అందులో మీరు కూడా పాలుపంచుకుంటూ ఉండమనీ సూచిస్తున్నారు. అలా కుదరకపోతే అసలు ఓ వారం రోజులపాటు సోషల్‌మీడియా జోలికే పోవద్దని సలహా ఇస్తున్నారు.

 

పరిశోధన 2 - ఎన్ని సైట్లైతే అంత డిప్రెషన్‌:

సోషల్‌ మీడియా ద్వారా చెలరేగిపోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ అందుకోసం చాలా మాధ్యమాలు సిద్ధంగా ఉన్నాయి. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌, వాట్సప్‌... ఇలా నానారకాల సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎన్ని సోషల్‌ మీడియా సైట్లలో పాలుపంచుకుంటే మనిషిలో అంత డిప్రెషన్‌ ఉంటుందని పిట్స్‌బర్గ్‌కు చెందిన పరిశోధకులు రుజువుచేశారు.

 

పరిశోధకులు తమ అధ్యయనం కోసం 1,787 మంది యువకులను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 19 నుంచి 32 ఏళ్ల లోపువారే! వీరు గూగుల్‌ ప్లస్, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, లింక్‌డ్‌ఇన్‌... వంటి 11 రకాల సోషల్‌ మీడియా సైట్లను ఏ తీరున అనుసరిస్తున్నారో గమనించారు. అధ్యయనం చివరికి తేలిన విషయం ఏమిటంటే... ఏడు లేక అంతకుమించి సోషల్‌ మీడియా సైట్లను అనుసరిస్తున్నవారిలో క్రుంగుబాటుకి సంబంధించిన లక్షణాలు మూడురెట్లు అధికంగా కనిపించాయట.

 

ఒక వ్యక్తిలో మానసిక సమస్యలు ఉండటం వల్ల, వెసులుబాటు కోసం ఇలా రకరకాల సైట్ల వంక పరుగులు తీస్తున్నాడా? లేకపోతే రకరకాల సైట్లని అనుసరించడం వల్ల మానసిక సమస్యలు ఏర్పడుతున్నాయా? అన్న విషయం మాత్రం తేలనేలేదు. అంటే పిల్ల ముందా? గుడ్డు ముందా? అన్న చందాన ఈ సమస్య ఉందన్నమాట. అందుకని ఈ విషయమై మరిన్ని పరిశోధనలు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

 

ఏది ఏమైనా, అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు సోషల్‌ మీడియాని కూడా అతిగా అనుసరించడం వల్ల ఏవో ఒక సమస్యలు తప్పవంటూ పై పరిశోధనలు రెండూ రుజువుచేస్తున్నాయి. అన్నింటికీ మించి సోషల్‌ మీడియాని మంచి విషయాలను పంచుకునేందుకు కాకుండా, ఇతరులతో పోల్చుకుంటూ ఉండేందుకు ఉపయోగిస్తే... ఈర్ష్యాద్వేషాలు తప్పవని నిరూపిస్తున్నాయి.

 

 

- నిర్జర.