ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు మ‌రింత జాగ్ర‌త్త!

21వ శ‌తాబ్దం వ‌చ్చేసింది. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని అంద‌రికీ అన్ని సౌక‌ర్యాలూ అందుబాటులో ఉంటున్నాయి. ఆరోగ్య‌ప‌రంగానూ, సాంకేతికంగానూ మున్ముందుకి అడుగులు వేస్తున్నాం. అన్నింటికీ మించి ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల వివ‌క్ష‌త త‌గ్గింద‌న్న అంచ‌నాలూ ఉన్నాయి. నిజానికి ఆడ‌పిల్లల జీవితాలు ఏమాత్రం మార‌లేదంటూ ఓ ప‌రిశోధ‌న వెలువ‌డింది.

ఇంగ్లండులోని లివ‌ర్‌పూల్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు ఆడ‌పిల్ల‌ల మ‌న‌స్థితి మీద ఒక అధ్య‌య‌నం చేశారు. ఒక‌టీ రెండూ కాదు... ఏకంగా 14 ఏళ్ల పాటు గ‌ణాంకాల‌ను సేక‌రించారు. ఇందుకోసం 2000-2001లో జ‌న్మించిన దాదాపు ప‌దివేల మంది పిల్ల‌ల‌ను నిశితంగా గ‌మ‌నించారు. 3, 5, 7, 1, 14 ఏళ్ల‌లో వారి మ‌న‌స్త‌త్వం ఎలా ఉందో అంచ‌నా వేసే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ప్ర‌శ్నాప‌త్రాల ద్వారా పిల్ల‌ల మ‌న‌స్థితిని గ‌మ‌నించారు.

మ‌గ‌పిల్ల‌లైనా, ఆడ‌పిల్ల‌లైనా చిన్న‌ప్పుడు అంతా సంతోషంగానే క‌నిపించారు. వారి మ‌న‌సుల్లో పెద్ద‌గా క‌ల‌త క‌నిపించ‌లేదు. కానీ వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ... ఆడ‌పిల్ల‌ల మ‌న‌సు కుంగిపోవ‌డాన్ని గ‌మ‌నించారు. ఇలా కాస్తోకూస్తో కాదు... ప‌ధ్నాలుగో ఏడు వ‌చ్చేసరికి దాదాపు నాలుగోవంతు మంది ఆడ‌పిల్ల‌లలో డిప్రెష‌న్ తాలూకు ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అదే మగ‌పిల్ల‌లో అయితే కేవ‌లం ప‌దిశాతం లోపుమంది పిల్ల‌ల‌లోనే డిప్రెష‌న్ సూచ‌న‌లు క‌నిపించాయి. కుటుంబ ఆర్థిక‌ప‌రిస్థితులు క‌నుక బాగోలేక‌పోతే.... డిప్రెష‌న్‌కు లోన‌య్యే ప్ర‌మాదం మ‌రింత తీవ్రంగా ఉండ‌టం మ‌రో విషాదం.

సాధార‌ణంగా పిల్ల‌లు త‌మ మ‌న‌సులోని దుగ్ధ‌ను స్ప‌ష్టంగా చెప్పుకోలేరు. కుటుంబంలోని పెద్ద‌లే, పిల్ల‌ల మ‌న‌సులోని విచారాన్ని ఊహించే ప్ర‌య‌త్నం చేయాలి. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మ‌గ‌పిల్ల‌లని మ‌న‌సుని ప‌సిగ‌ట్టేసే పెద్ద‌లు, ఆడ‌పిల్ల‌ల మ‌న‌సులో ఏం మెదులుతోందో ఏమాత్రం ఊహించలేక‌పోతున్నార‌ట‌. దాంతో ఆడ‌పిల్ల‌ల మ‌న‌సుని సాంత్వ‌న ప‌రిచే ప‌రిస్థితులు లేక‌, వారు మ‌రింత‌గా డిప్రెష‌న్‌లోకి కూరుకుపోతున్నారు. పైగా మ‌గ‌పిల్ల‌ల‌తో పోలిస్తే ఆడ‌పిల్ల‌లు ఎదుర్కొనే ప‌రిస్థితులు విభిన్నంగా ఉంటాయి. శారీరికంగానూ, మాన‌సికంగానూ వారు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఎదిగేకొద్దీ ఏదో ఒక రూపంగా వారికి వివ‌క్ష ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇవ‌న్నీ కూడా వారి మ‌న‌సుల మీద చెర‌గ‌ని గాయం చేస్తాయి.

మ‌గ‌పిల్ల‌లతో పోలిస్తే, ఆడ‌పిల్ల‌ల‌ని మ‌రింత కంటికిరెప్ప‌లా కాపాడుకోవాల్సిన అవ‌స‌రాన్ని ఈ ప‌రిశోధ‌న గుర్తుచేస్తోంది. దీనిని త‌ల్లిదండ్రులు ఓసారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే... ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు మ‌రింగ బాగుంటుందేమో!

- నిర్జ‌ర‌.