పంటి పరీక్షలతో చాలా మేలు

 

కీళ్ల నొప్పులు, ఎముకలు అరిగిపోవడం, కూర్చుంటే లేవలేని పరిస్తితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి, చాలా దారుణమైన హింస. ఇలాంటి హింస వయసు పైబడినవాళ్లకు తప్పట్లేదు. ముందుగా మేల్కొన్న వాళ్లకు మాత్రం ఈ విషయంలో ఇబ్బందులు కాస్త తక్కువే అని చెప్పాలి. మరి ఇలాంటి కాళ్లూ, కీళ్లూ నొప్పుల బెడదను ముందుగా గుర్తించడానికి మార్గమేదైనా ఉందా.. అని అడిగితే డాక్టర్లు ఇప్పుడు చాలా సులభమైన మార్గం కూడా రెడీగా ఉందంటున్నారు.

 

క్రమం తప్పకుండా డెంటల్ పరీక్షలు చేయించుకునేవాళ్లకు ఎముకలు బోలుగా మారుతున్నాయా లేదా అన్న విషయాన్ని కనిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ పరిశోధనలు చెబుతున్నాయట. ఐదు వేల డెంటల్ ఎక్సరేల్ని క్షుణ్ణంగా పరిశీలించాక వైద్య శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఓ నిర్థారణకొచ్చారు. ఎముకల పటుత్వం తగ్గిపోవడవల్ల ముందుగా దెబ్బతినేవి దవడ ఎముకలే కనుక, డెంటల్ ఎక్స్ రేలవల్ల ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలున్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. సో.. క్రమంతప్పకుండా పళ్లని పరీక్షచేయించుకుంటే పనిలోపనిగా ఎముకల పటుత్వం సంగతికూడా తేలిపోతుందన్న మాట.. పదిహేనునుంచి తొంభైనాలుగేళ్ల మధ్యలో ఉన్నవాళ్ల డెంటల్ ఎక్సరేలను పరీక్షించినప్పుడు ఈ వివరాలు బైటపడ్డాయ్.