నోట్ల రద్దుకి ఏడాది... ఎవరికి ఏం ఒరిగింది...?

 

నవంబర్ 8 ఈ రోజు అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన రోజు. సరిగ్గా ఈరోజుకి ఏడాది పూర్తి చేసుకుంది. ఆరోజు మోడీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నల్ల కుబేరులకు షాకిచ్చి.. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే అప్పుటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు పరిచారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో నల్ల కుబేరుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఏమైనా లాభం చేకూరిందా..? మోడీ తీసుకున్న ఈ నిర్ణ‌యం భార‌తావానికి ఏమైనా మేలు చేసిందా ?  మోడీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం నెర‌వేరిందా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆన్స‌ర్ లేదు. ఎందుకంటే మోడీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల వెలుగులోకి వ‌చ్చిన న‌ల్ల‌ధ‌నం చాలా త‌క్కువ‌. ఇక విదేశాల్లో మూలుగుతోన్న న‌ల్ల‌ధ‌నాన్ని ఇండియాకు ర‌ప్పిస్తామ‌ని మోడీ చేసిన హామీ కూడా నెర‌వేర‌లేదు. మరి న‌ల్ల‌ధ‌న ప్ర‌వాహం ఆగిందా అంటే అది లేదు. పోనీ ఈ ప‌ని వ‌ల్ల డిజిటలైజేషన్‌ వైపు మొగ్గు చూపారా..? అంటే అదీ లేదు. అందుకే సామాన్య ప్రజలతో పాటు  విప‌క్షాలు, వామ‌ప‌క్షాల నుండి విమర్శలు తలెత్తాయి.

 

ఓ రకంగా చెప్పాలంటే మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌కుండా వెంటనే అమలు చేయడమే మోడీ చేసిన తప్పు. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడింది ఎవరంటే సామాన్య ప్రజలే. ఎన్నో కష్టాలు పడ్డారు. పెళ్లిళ్లు ఆగిపోయాయి. శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. గంటల తరబడి బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర క్యూల్లో నిల్చున్నారు. అలా కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఉంటే మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నోట్ల ర‌ద్దుకు యేడాది పూర్త‌వుతోన్న వేళ విప‌క్షాలు నిర‌స‌న‌ల‌కు దిగుతున్నాయి. ఈరోజును బ్లాక్‌డేగా వర్ణిస్తున్నాయి. మరోవైపు బిజెపి పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ... నవంబర్‌ 8న నల్లధనం వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఏదేమైనా ఫైన‌ల్‌గా నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశానికి ఒరిగింది త‌క్కువ అయితే సామాన్యులు ప‌డిన ఇబ్బందుల‌కు లెక్కేలేదు. ఈసారైనా మోడీ ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు వెనుకా.. ముందు ఆలోచించుకొని తీసుకోవడం మంచిది...