నోట్ల రద్దుతో దేశానికి జరిగింది ఇదే.. !

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతో పాటు ఆర్థిక రంగాన్ని ప్రక్షాళన చేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేశారు. అయితే ఆయన నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపించింది. సామాన్యూడి నుంచి ప్రముఖుల దాకా..నిరుద్యోగి నుంచి వ్యాపార సామ్రాజ్యాధినేతల వరకు ఇది ప్రభావాన్ని చూపించింది. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాశారు. ప్రభుత్వం ఏం చేసినా జనానికి ప్రయోజనం చేకూర్చాలి గానీ..కష్టాల పాలు చేయకూడదు అంటూ మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

 

ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. నోట్ల రద్దుతో దేశానికి మూడు రకాల ప్రయోజనాలు చేకూరాయట. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగడంతో పాటు పన్ను రాబడి పెరిగిందని, పెద్ద నోట్ల చెలామణి నియంత్రించగలిగామని జైట్లీ అన్నారు. బ్యాంకులకు తిరిగి వచ్చిన సొమ్ము ఆధారంగా కొంత మంది తెలిసి..తెలియకుండా నోట్ల రద్దు విజయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. మరీ జైట్లీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.