ధామినీ! మమ్మల్ని క్షమించు తల్లీ!

Publish Date:Dec 29, 2012

 

డిల్లీ అత్యాచార భాదితురాలు (ధామిని) మృతితో ఒక విషాదకర అధ్యాయం ముగిసింది. తనకు బ్రతకాలని ఉందని ఆమె కోరుకోన్నపటికీ బ్రతకలేకపోయింది. ఆమె స్త్రీగా జన్మించడమే ఆమెకు ఈ మరణ దండన విదించింది. ఆమెకే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన స్త్రీకయినా ఇటువంటి అనుభవాలే ఎదురవడం విచారకరం. కేవలం స్త్రీలకే గాకుండా ఆడపిల్లగా పుట్టిన పాపానికి అన్నెం పున్నెం ఎరుగని పసిపాపలు కూడా కామందుల పశువాంచకి బలయిపోవడం చూస్తే, మన చుట్టూ మానవ రూపంలో తిరుగాడుతున్న మృగాలు ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నాయో తెలుస్తోంది. ఉయ్యాలలో నిద్రించే పసికందుని, ట్వింకిల్... ట్వింకిల్... లిట్టిల్ స్టార్ అని ముద్దుముద్దుగా పలికే పసి బాలలను కూడా ఒంటరిగా వదలలేని దుస్థితిలో మన సమాజం ఉందంటే అది మనందరికీ కూడా సిగ్గుచేటు.

 

ఒకవైపు డిల్లీలో జోరుగా ఆందోళనలు సాగుతుండగానే మరో వైపు యధేచ్చగా అత్యాచారాలు జరుగుతుండటం, వాటికి ప్రజల, ప్రభుత్వస్పందన నామమాత్రంగానయిన కరువవడం మనం డిల్లీ సంఘటన నుండి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని గుర్తు చేస్తోంది. ఏదయినా ఒక సంఘటన జరిగిన వెంటనే కొద్ది రోజుల పాటు అందరూ ఉవ్వెత్తున ప్రతిస్పందనలు వ్యక్తం చేయడం, ఆ తరువాత మళ్ళీ ప్రజలు తమ దైనందిన జీవితచర్యలలోములిగిపోవడం, ప్రభుత్వం కూడా మరోఅంశం వైపు మరలి పోవడం జరుతోందేతప్ప ఎదురయిన ప్రతీ సమస్యకి పరిష్కారం వెతికి, అమలు చేసే వరకు పట్టుదల చూపాలని ఎవరు అనుకోకపోవడం వల్లనే, ఇటువంటి తీవ్ర సమస్యలు పునరావృతమవుతున్నాయి. అది డిల్లీ అత్యాచార సంఘటన కావచ్చును లేదా ముంబై దాడులు కావచ్చును. ప్రతీ అంశంపైన మన ప్రతిస్పందనలు తాత్కాలిక భావోద్వేగాలతో కూడుకోన్నవే తప్ప, సకారాత్మకమయిన చర్యలు మాత్రం అరుదుగా కనిపిస్తాయి.

 

ప్రస్తుతం మన ప్రభుత్వము, న్యాయస్థానాలు వెంటనే స్పందించి కొన్ని చర్యలు చేపడుతున్నపటికీ, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలలో మార్పులు చేసుకోవడం, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు నిరంతర కార్యక్రమాలు చెప్పటడం వంటివి జరగాలి.

 

ప్రభుత్వము చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో అమలు చేస్తున్న ఒకేఒక కార్యక్రమం ‘పోలియో నివారణ’ ద్వారా నేడు మనదేశం పోలియో మహమ్మారి నుండి ఏవిదంగా బయట పడగలిగిందో చూస్తే, ఎటువంటి పనయినా చిత్తశుద్దితో చేపడితే తగిన ఫలితాలు తప్పక వెలువడతాయని తెలుస్తోంది. ప్రజలలో చైతన్యంతోనే ఇటువంటి అత్యాచారాలు పూర్తిగా సమసిపోతాయని చెప్పలేకపోయినా, కొంత మేరకు వాటి తీవ్రత తగ్గించగలమని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

అయితే, ఇటువంటి సమస్య పరిష్కారానికి సమాజం తన కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టవలసి ఉంటుంది. విద్య, ఆహారం, వస్త్రధారణ, కట్టుబాట్లు వంటి అనేక విషయాలలో మన సమజం బాలబాలికల మద్య తీవ్ర వ్యత్యాసం చూపుతూ, మగపిల్లలను కొంచెం ‘అధిక సమానం’ అనే రీతిలో పెంచడంవల్లనే, ఆ ప్రభావంతో పెరిగిన మగపిల్లలు తరువాతకాలంలో స్త్రీల పట్ల చులకనభావం ప్రదర్శిచడం జరుగుతోంది.

 

నిజం చెప్పాలంటే మన భారతీయ సంస్కృతికి లేదా ప్రపంచంలో మరే ఇతర దేశాల సంస్కృతికి అయినా అద్దం పట్టేవారు సాధారణంగా మహిళలే అయి ఉండటం, మహిళల ప్రత్యేకతని చాటిచెపుతోంది. అటువంటి మహిళల పట్ల సభ్య సమాజం తలదించుకొనే విదంగా మానవమృగాల హేయమయిన చర్యలకి పాల్పడుతున్నపటికీ మనం స్పందించకపోతే సమాజంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. అంతే గాకుండా, భావితరల ముందు మనం దోషులుగా నిలబడవలసిన దుస్థితి కూడా ఎదుర్కోకతప్పదు.

 

చట్టాలు, శిక్షలు ఎన్ని మార్పులు చేసుకొనప్పటికీ, మనమంతా కలిసి భావిభారత పౌరులుగా తీర్చి దిద్దలనుకొంటున్న బాలలను బాల్యం నుండే కుటుంబంలో, తరగతి గదుల్లో బాలల మనస్సులో మనం మంచి విత్తులు నాటగలిగిన నాడు, సమాజంలో నేర ప్రవృత్తికూడా క్రమంగా అంతరించే అవకాశం ఉంది.