ఏ దౌర్భాగ్యాలకీ మరణశాసనం

Publish Date:Sep 14, 2013

Advertisement

 

 

 ....సాయి లక్ష్మీ మద్దాల

 

ఢిల్లీ లో డిసెంబర్ 16 న అత్యాచారానికి గురికాబడిన నిర్భయ కేసులో ఢిల్లీ సాకేత్ కోర్ట్ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు. అందరూ కోరుకున్నట్టు గానే నిందితులు నలుగురికి మరణ శిక్ష విధించారు. యావత్ భారత ప్రజానీకం ముఖ్యంగా నిర్భయ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అదే తరహాలో అన్ని అత్యాచార కేసులు పరిష్కరించబడితే భారత దేశంలో ఆడవాళ్ళకి కొంత మానసిక భరోసా దొరుకుతుంది. కానీ అది ఎప్పటికీ ఎండమావే. ఎందుకంటె తీర్పు వెలువడిన అనంతరం నిందితుల తరఫు న్యాయవాది ఇంతకముందు జరిగిన అన్ని రేప్ కేసుల్లోనూ ఇలాగే కోర్టులు వ్యవహరించాయ అని ప్రశ్నిస్తూ,రాబోయే 3 నెలలలో ఒక్క రేప్ కూడా జరగదా అని ప్రస్నిమ్చటం జరిగింది. ఆ న్యాయవాది భావాన్ని దేశ ప్రజలు యేమని అర్ధం చేసుకోవాలి. అన్నిటికి మించి చాలా అరుదైన నేరాలలోనే ఉరి శిక్షను విధించే భారత చట్టాలు ఏ భావజాల మార్పుకోసమని ఇంతటి కఠిన శిక్షను విధించారు.


ఇప్పటివరకు భారత దేశంలో ఒక్క నిర్భయ మీద మాత్రమే అత్యాచారం జరుగలేదు. ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోని రేప్ కేసులు రెండున్నర లక్షలు ఉన్నాయి. మరి వాటి సంగతేమిటి. మళ్ళి యావత్భారత యువత రోడ్లమీదికి వచ్చి పోరాటాలు చేస్తేనే గానీ వాటి జోలికి ఈ న్యాయస్థానాలు వెళ్ళవా?ఇక్కడ పరిష్కారం కావలసిన దౌర్భాగ్యాలు చాలా ఉన్నాయి. జస్టిస్ వర్మ గారు తన నివేదికలో ఎన్నో అంశాలను ప్రస్తావించారు. మనం నేడు చూస్తున్న చాలా వ్యస్థలలొ మార్పురావాలని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో,న్యాయవ్యవస్థలో,పోలీసు వ్యవస్థలో,తల్లిదండ్రులలో మార్పురావాలని ఆయన పేర్కొనటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీని ఈ సమాజం చూసే దృక్కోణంలో మార్పు రావాలన్నారు. అన్నిటితో బాటుగా మన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని కూడా ఆయన సూచించారు.


                    

నేటి భారతీయ విద్యావిధానం వ్యాపార కోణంలోనే సాగుతోంది కాని,సామాజిక చైతన్యాన్ని కల్పించే దిశలో కాని,సంస్కారహితంగా కానీ,మానవీయ విలువలను నేర్పించే విధంగా కానీ లేదు. దీనిని గురించి ఒక్కరోజైన చట్టసభలలో చర్చించ లేదు. అలాగే భారతదేశంలో ఆడవాళ్ళమీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఏ ఒక్కరోజున కూడా ఈ చట్టసభలు చర్చించాలని అనుకోలేదు. అసెంబ్లీ లోనే స్వయంగా తమ సెల్ ఫోన్లలో నీలిచిత్రాలు చూసే స్థాయికి శాసనసభ్యులు దిగజారుతుంటే ఇంక చర్చలు ఎలా జరుగుతాయి?. ఢిల్లీ లో రాత్రి 9 గంటల సమయంలోనే నడిరోడ్డు మీదే ఇంతటి ఘోరకలి జరిగే స్థితికి అక్కడి పోలీసు వ్యస్థను ఏమనాలి?ఢిల్లీ లో అత్యాచారాలు లెక్కలేనన్ని జరుగుతాయ్ ఇది మామూలే అనే ఆలోచనా సరళిని ఎవరు మార్చాలి?


                     

తల్లిదండ్రులలో మార్పు రావాలి అంటే .దాని అర్ధం మార్పు ఇంటి నుండే మొదలవ్వాలి అని. ఆడపిల్లను ఒకరకంగ,మగపిల్లవాడిని ఒకరకంగా పెంచే విధానంలో మార్పు రావాలి. మరీ ముఖ్యంగా నేటి సినిమాలు,టీవీలలో వచ్చే కార్యక్రమాలు,వ్యాపార ప్రకటనలు,వార్త పత్రికలు,ఇంటర్నెట్,ఇలాచెప్పుకుంటూ పోతే మన చుట్టూరా ఉన్న మన సభ్య సమాజంలోని చాలా వ్యవస్థల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. సినిమాలకు సెన్సార్ బోర్డు ఉంది కానీ సినిమాలలోని అశ్లీల దృశ్యాలకు అడ్డుకట్ట ఉండదు. మరి వీటన్నిటి గురించి ఆలోచించ వలసిన భాద్యత చట్టాలకు,ప్రభుత్వాలకు లేదా?అధికారులను ప్రభావితం చేస్తున్న రాజకీయ వ్యవస్థ కారణంగా ఎంతమంది తమకు న్యాయం జరగలేదని అల్లడుతున్నారో సదరు నేతలకు తెలియదా?


                     

ఈనాడు ఇంతగా బ్రష్టు పట్టిన ఈ సమాజంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగకూడదు అంటే కఠినమైన శిక్షలతో బాటుగా విలువలతో కూడిన విద్యావిధానం,సామాజిక చైతన్యం,సంస్కారయుతమైన కుటుంబ వాతావరణం,అన్నిటికి మించి ఏ పరివర్తన కోసం జైలు శిక్షలు విదిస్తున్నారో ఆ పరివర్తన తాలూకు విధానాల అమలు సరిగా జరగలేనినాడు ఎవరికి ఎటువంటి న్యాయమూ జరగదు. సమస్యకు మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా ఒక సమస్యకు ఒక కఠిన శిక్ష విధించి చేతులు దులిపెసుకుంటే నేరాలు ఎలా అరికట్టబడతాయి.


                    

ముఖ్యంగా యావత్ ప్రపంచం గుర్తించాల్సింది ఆడది ఒక విలాస వస్తువు కాదు. ఆడది రెండో వర్గం పౌరురాలు కాదు. ఆడది లేని ఈ సమాజాన్ని ఎవరైనా ఊహించగలరా?ఆడది  కేవలం ఒక భోగ వస్తువుగా చూపించబడుతున్నంత కాలం ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. మరి శిక్షలు ఎవరికి వేస్తారు?అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికా లేక వారిని అలా ప్రేరే పిస్తున్న వివిధ రకాలైన నియంత్రణ లేని వ్యవస్థలకా?